టీఆర్ఎస్ కు షాక్

లోక్ సభ ఎన్నికల ముందు తెలంగాణలోని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కు షాక్ తగిలింది. ఇప్పటి వరకూ తెలంగాణలో తమకు తిరుగులేదని భావిస్తున్న ఆ పార్టీకి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం నాడు వెల్లడైన వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్ ఓటమిపాలైయ్యారు. యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి విజయం సాధించారు. మొత్తం 18885 ఓట్లు పోలవ్వగా నర్సిరెడ్డికి 8976 ఓట్లు రాగా.. పూల రవీందర్‌కు 6279 ఓట్ల వచ్చాయి.
గెలుపునకు కావల్సింది 9014 కావడంతో 38 ఓట్ల దూరంలో నర్సిరెడ్డి నిలిచిపోయారు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లలో నర్సిరెడ్డి విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. పూల రవీందర్‌కు టీఆర్‌ఎస్ మద్దతు ప్రకటించగా, నర్సిరెడ్డికి కాంగ్రెస్, వామపక్షలు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. నర్సిరెడ్డి గతంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ పరిణామం ప్రతిపక్ష పార్టీలకు కొత్త జోష్ ఇస్తుందనటంలో సందేహం లేదు.