Telugu Gateway
Politics

కుటుంబరావుపై మంచు మనోజ్ ఫైర్

కుటుంబరావుపై మంచు మనోజ్ ఫైర్
X

ఏపీలో ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలపై రగడ సాగుతునే ఉంది. మోహన్‌బాబు విద్యాసంస్థలు నడుపుతున్నారా? లేక వ్యాపారం చేస్తున్నారా? అంటూ ఎటాక్ చేసిన ప్రణాళిక సంఘం ఉఫాధ్యక్షుడు కుటుంబరావుపై మంచు మనోజ్‌ మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ విషయంలో తాము చెప్పిన బకాయి మొత్తం తప్పని నిరూపిస్తే మొత్తం ఫీజురియింబర్స్‌ మెంట్‌ వదులు కుంటామని సవాల్‌ విసిరారు. కుటుంబరావు ఆంధ్రప్రజల కుటుంబం తరఫున కాకుండా కేవలం నారా కుటుంబం తరఫున వకాల్తా పుచ్చుకోని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు మనోజ్‌ శుక్రవారం ఓ ప్రతికా ప్రకటనను విడుదల చేశారు. దానికి వారి విద్యాసంస్థలకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ కింద కేటాయించాల్సిన బకాయిలకు సంబంధించిన ఆధారాలను జత చేశారు. ‘ఫిబ్రవరిలోనే తమ కాలేజీకి రావాల్సిన బకాయిలను ఐఏఎస్‌ రావత్‌కు లిఖిత పూర్వకంగా తెలియజేశాం. ఒక్కవారంలో పంపుతామని చెప్పారు. వారు చెప్పిన తేదీల్లో రానందున మరోసారి సమావేశమై డబ్బులు అందలేదని చెప్పాం. దానికీ కూడా సమాధానం రాకపోవడంతో మీడియా ముందుకు వచ్చాం. జ్ఞానభూమి స్కాలర్‌షిప్‌ స్టేట్మెంట్‌ 2018-19 అని ఒక కరపత్రం విద్యార్థులకు అందజేశారు. దానిలో మూడో విడత ఫీజు రియంబర్స్‌మెంట్‌ ఫిబ్రవరిలో అందజేస్తారని ఉంది. తొలి విడత బకాయికే దిక్కులేదు.

రెండవ విడత పూర్తి కాలేదు. కానీ మూడో విడత అందజేస్తామని డబ్బా కొట్టుకున్నారు. ఓ పెద్దమనిషీ.. 2017-18 ఏడాదిలో రూ.2 కోట్ల పదహారు లక్షల బకాయి ఉంది. మీరు చదువుకున్న వ్యక్తి కాబట్టే అసలు నిజాన్ని దాచి పెట్టి మాట్లాడారు. వక్రబుద్ది మంతుడా.. ఈ కాలేజీ పెట్టింది ఎప్పుడు? ఎప్పటి నుంచి మా నాన్నగారు 25 శాతం ఫ్రీ ఎడ్యుకేషన్‌ కుల మతాలకు అతీతంగా అందిస్తున్నారు? మా విద్యానికేత డాక్యుమెంట్లు అందజేస్తాం. తెలుసుకో.. నోరు విప్పే ముందు కళ్లు విప్పి చూడు. 25 శాతం మీరిచ్చే సొమ్ముతో కాదు.. మా నాన్న సినిమాల్లో సంపాదించిన సొమ్ముతో అన్న నిజాన్ని తెలుసుకో. అనుమానం ఉంటే ఆదాయపు పన్ను పత్రాలు పరీక్షించుకో. ఇది ఓపెన్‌ చాలెంజ్‌. ఇది అడ్డదారి డబ్బు కాదు.. ప్రజలు మోసం చేసి సంపాదించిన సొమ్ము అంతకంటే కాదు. ఏదో పార్టీ తరఫున మాట్లాడుతున్నామని, పార్టీ టికెట్లు అడిగామని లేనిపోని నిందలు వేస్తున్నారు. నేను, మా అక్క రాజకీయ టికెట్టు కాదు కదా.. సినిమా టికెట్లు కూడా అడగలేదు’ అని మనోజ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story
Share it