మాది ఆధ్యాత్మిక హిందూత్వం

తెలంగాణ బిజెపి నేతల వ్యాఖ్యలపై సీఎం కెసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముందు తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని..తాను ప్రశ్నిస్తే సోషల్ మీడియా వేదికగా తనపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కెసీఆర్ మంగళవారం నాడు నిజామాబాద్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. బిజెపిది రాజకీయాల హిందూత్వం అయితే..తమది ఆథ్యాత్మిక హిందూత్వం అని వ్యాఖ్యానించారు. నిత్యం బీసీల గురించి జపం చేసే బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రంలో ఇప్పటివరకూ ఎందుకు బీసీ మంత్రిత్వ శాఖ పెట్టలేదని ప్రశ్నించారు. ఎర్రజొన్న, పసుపు రైతులు మంది మాటలు పట్టుకోని ఆగం కావద్దు ఎన్నికల తర్వాత రైతులకు న్యాయం చేస్తానని కెసీఆర్ హామీ ఇచ్చారు. కేంద్రంలో బీజెపీ, కాంగ్రేస్ లేని ఫెడరల్ ఫ్రంట్ రావాలన్నారు. 73 సంవత్సరాలు కేంద్రంలో బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వాలను చూశామని..బీడీ కార్మికుల సమస్యలను ఎవరూ పట్టించుకోలేదన్నారు. 54 ఏళ్లు కాంగ్రెస్, 11 బీజేపీ ఏళ్లు దేశాన్ని పాలించాయని, వారి పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. ఈ స్థితిలో దేశ వ్యాప్తంగా మార్పు రావాలని, ఆ పోలికేక తెలంగాణ రాష్ట్రం నుంచే ప్రారంభంకావాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రపంచంలో ఏ దేశానికి లేని యువశక్తి మన దేశానికి ఉందని, కానీ వారి దరిద్రపుగొట్టు పాలన కారణంగా యువశక్తిని వినియోగిచుకోలేకపోతున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి అంటే చైనా, జర్మనీ, జపాన్ వంటి దేశాల గురించే మాట్లాడుకునే పరిస్థితిని గత పాలకులు తీసుకువచ్చారని కేసీఆర్ ధ్వజమెత్తారు. ఈనెల 21న లోక్‌సభ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని వెల్లడించారు. కొత్త ఆర్థిక వ్యవస్థ, రాజ్యాంగంలో సవరణలు, నీటివిధానంలో సమూలు మార్పులు రావాలని ఆయన స్పష్టం చేశారు. రోజూ మైకులు పగిలేలా మాట్లాడే ప్రధాని నరేంద్ర మోదీ, నేషనల్ హెరాల్డ్ కేసులో నిందితులుగా ఉన్న రాహుల్, సోనియా గాంధీ వల్ల దేశానికి ఎలాంటి ఉపయోగం లేదన్నారు.
రామజన్మ భూమిపై టీఆర్‌ఎస్ స్టాండ్ ఏంటనీ బీజేపీ ప్రశ్నించడంపై కేసీఆర్ స్పందించారు. బీజేపీ ప్రజల కోసం పనిచేసే పార్టీనా లేక జన్మభూములు, రామమందీరాల పంచాయతీలు చేసే పార్టీనా అని ప్రశ్నించారు. మీరొక్కరే హిందూవులు కాదని.. తామంతా హిందువులమనే చెప్పుకొచ్చారు. ఆర్మూర్ నియోజకవర్గంలో కొత్త మండలాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. వాటిని కూడా ఏర్పాటు చేస్తాం. కరీంనగర్ సభలో నేను మాట్లాడుంటే కాంగ్రెస్, బీజేపీ పీఠాలు కదిలిపోత్తున్నాయి. నిజాలు మాట్లాడితే అలానే ఉంటుంది. మహారాష్ట్ర చెందిన కొన్ని గ్రామాల వారు వాళ్లని కూడా తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే అర్థం అవుతుందని వ్యాఖ్యానించారు.