Telugu Gateway
Politics

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పై కోర్టుకెక్కనున్న ఎన్టీఆర్ ఫ్యామిలీ?!

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పై కోర్టుకెక్కనున్న ఎన్టీఆర్ ఫ్యామిలీ?!
X

‘మన దగ్గర నిజం ఉంది. నిజాన్ని ఎవరూ ఆపలేరు’ ఇదీ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రెండవ ట్రైలర్ లో ఉన్న డైలాగ్. ఈ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మొదట నుంచి తమదే నిజమైన సినిమా అని చెబుతూ వస్తున్నారు. స్వర్గం నుంచి ఎన్టీఆర్ ఆశీస్సులు కూడా తమకే ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైతే ఆయన సినిమా విడుదల తేదీని మార్చి 22గా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా? లేదా అన్న అనుమానాలు ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ. దీని వెనక బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాలో తమ కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసే అంశాలు ఉన్నాయని..తమ అనుమతి లేకుండా సినిమా విడుదల చేయకుండా చూడాలంటూ హైకోర్టును ఆశ్రయించేందుకకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు రెడీ అయినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అధికారికంగా విడుదల తేదీ వచ్చిన వెంటనే కోర్టును ఆశ్రయించేందుకు ఎన్టీఆర్ ఫ్యామిలీ ఇప్పటికే రెడీ అయిపోయిందని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఏ క్షణంలో అయినా ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ రాజకీయాలతో ముడిపడి ఉన్న సినిమా కావటంతో ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయటానికి కూడా టీడీపీ రెడీ అవుతోంది. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ఎంటర్ అయిన జరిగిన పరిణామాలు..చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడు చేయటం వంటి అంశాలు ఈ సినిమాలో అత్యంత కీలకం కానున్నాయి. ఓ వైపు బాలకృష్ణ హీరోగా..నిర్మాతగా తెరకెక్కించిన ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితాలకు సంబంధించిన కథానాయకుడు, మహానాయకుడు బాక్సాఫీస్ వద్ద ఘోర ఫలితాన్ని చవిచూశాయి. టీడీపీ డబ్బులిచ్చి ఉచితంగా మహానాయకుడు సినిమా షోలు వేస్తున్నా చూసేవారే కరువయ్యారనే రిపోర్టులు ఎన్టీఆర్ అభిమానులను మరింత ఇరకాటంలోకి నెడుతున్నాయి. ఈ తరుణంలో అందరి చూపు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై హైప్ నెలకొంది. మరి కోర్టు అడ్డంకులు..ఈసీ అవాంతరాలు దాటుకుని వర్మ సినిమా విడుదల అవుతుందా? లేదా అంటే వేచిచూడాల్సిందే అని చెబుతున్నారు.

Next Story
Share it