Telugu Gateway
Politics

కెటీఆర్ లాజిక్ ను ప్రజలు నమ్ముతారా?

కెటీఆర్ లాజిక్ ను ప్రజలు నమ్ముతారా?
X

తెలంగాణలో పదహారు లోక్ సభ సీట్లను గెలుచుకుని కేంద్రంలో కీలక పాత్ర పోషించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తహతహలాడుతోంది. పదహారు సీట్లు ఇస్తే..వాటిని 160 చేస్తామని చెబుతున్నారు. ఇదంతా ఒకెత్తు అయితే..తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ తన ఎన్నికల ప్రచారంలో పదే పదే ఓ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. తెలంగాణలో బిజెపి ఎంపీలను గెలిపిస్తే నరేంద్రమోడీకి లాభం. కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తే రాహుల్ గాంధీకి లాభం. టీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే తెలంగాణకు లాభం అని చెబుతున్నారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీల విషయం ఆ పార్టీ అగ్ర నేతలు అయిన మోడీ, రాహుల్ కు లాభం అయితే..ఇక్కడ మాత్రం కెసీఆర్ కు లాభం కాకుండా..తెలంగాణకు లాభం ఎట్లా అవుతుంది?. అక్కడేమో ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్పేసి ఇక్కడ మాత్రం రాష్ట్రానికి లాభం అంటే ప్రజలు నమ్ముతారా?.

ఈ లాజిక్ వర్కవుట్ అవుతుందా?. కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ కు, బిజెపి గెలిస్తే మోడీకి లాభం అయినప్పుడు టీఆర్ఎస్ గెలిస్తే కెసీఆర్ కే లాభం కావాలి కదా?. కానీ కెటీఆర్ సడన్ గా కెసీఆర్ స్థానంలో తెలంగాణకు లాభం అంటే ప్రజలు నమ్ముతారా?. విపక్షాలు ప్రశ్నిస్తున్నట్లు ప్రస్తుత లోక్ సభలో కూడా ఫిరాయింపు ఎంపీలతో కలుపుకుని టీఆర్ఎస్ తన దగ్గర పెద్ద సంఖ్యలో ఎంపీలను ఏమి సాధించిందనే విపక్షాల ప్రశ్నలకు టీఆర్ఎస్ నేతల దగ్గర సమాధానం లేదు. పైగా ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న అన్ని కీలక నిర్ణయాలకు టీఆర్ఎస్ తన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఏ ఒక్క అంశంలోనూ రాష్ట్రానికి సంబంధించిన అంశాలను పరిష్కరిస్తేనే మద్దతు అనే ‘లింక్’ ఎక్కడా పెట్టలేదు. మరి కెటీఆర్ వాదనను ప్రజలు నమ్ముతారా? లేదా తెలియాలంటే మే 23 వరకూ వేచిచూడాల్సిందే.

Next Story
Share it