Telugu Gateway
Politics

కెసీఆర్ సంచలన ప్రకటన

కెసీఆర్ సంచలన ప్రకటన
X

లోక్ సభ ఎన్నికల ముందర తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, సీఎం కెసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల తర్వాత జాతీయ పార్టీని ఏర్పాటు చేసి..కొత్త ఏజెండాను సిద్ధం చేస్తానని తెలిపారు. ఇప్పటివరకూ దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బిజెపిలు దేశాన్ని ప్రగతిపథంలో నడిపించటం ఘోరంగా విఫలమయ్యాయని వ్యాఖ్యానించారు. కెసీఆర్ ఆదివారం నాడు కరీంనగర్ లో లోక్ సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పోరాటాల గడ్డ, కలిసివచ్చిన కరీంనగర్‌ నుంచే ఈ మాట చెప్పేందుకు వచ్చానని పేర్కొన్నారు. ప్రజలు ఆశీర్వదించి.. 16 సీట్లిస్తే ఢిల్లీలో అగ్గిరాజేస్త’అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఒకరినొకరు తిట్టుకుంటూ ప్రపంచదేశాల్లో నగుబాటు అయ్యే పార్టీలు దేశానికి అక్కర్లేదు. ప్రాంతీయ పార్టీలతో కూడిన ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు కావాలన్నారు. ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో మాట్లాడిన. ఎక్కడో ఒకదగ్గర.. ఎవరో ఒకరు తెగించకపోతే ఏమీ సాధ్యం కాదు. తెలంగాణ జెండా పట్టుకున్న నాడు ఎన్నో అవహేళనలు ఎదుర్కొన్నా. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ సాధించిన. సాధించిన తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపినా. ఇయ్యాల తెలంగాణ రాకపోతే పేదోడి పరిస్థితి ఏమయ్యేది? నీళ్లు వచ్చేవా? 24 గంటల కరెంట్‌ వచ్చేదా? దేశ రాజకీయాలను తెలంగాణ ప్రభావితం చెయ్యాలె.

తెలంగాణ దేశానికి ఒక చోదక శక్తి, దిక్సూచి కావాలె. దేశంలో ఎన్నో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. దాని కోసం మీ ఆశీర్వాదం కావాలి’అని ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేశారు. వెళ్లమంటారా.. జాతీయ రాజకీయాల్లోకి? అని ప్రజలను ప్రశ్నిస్తూ.. వెళ్లమనే వారు చేతులెత్తాలని కోరారు. దీంతో సభకు హాజరైన ప్రజలు, నాయకులు, కార్యకర్తలు నిలబడి పీఎం కేసీఆర్‌ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ తమ సంఘీభావం తెలిపారు. వేదికపై ఉన్న నేతలు సైతం నిలబడి తమ మద్దతు ప్రకటించారు. దేశానికి దారుణ గతి పట్టించింది కాంగ్రెస్, బీజేపీలేనని కేసీఆర్‌ ధ్వజమెత్తారు. దేశంలో 70 వేల టీఎంసీల నీరు లభిస్తున్నా.. దేశం మొత్తంలో 40 కోట్ల ఎకరాల సాగుకు అవసరమైన 40వేల టీఎంసీల నీరు ఇవ్వలేని దుస్థితికి కారణం ఈ పార్టీలేనన్నారు. కృష్ణా నీటి పంపకాలపై 2004లో ఏర్పాటైన బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ రెండు నెలల్లో తీర్చాల్సిన నీళ్ల పంచాయతీని 15 ఏళ్లైనా తేల్చలేదన్నారు. దేశంలో 3.44 లక్షల మెగావాట్ల విద్యుత్‌ స్థాపితశక్తి ఉండగా, అందులో బొగ్గు, అణువిద్యుత్‌ ద్వారానే 2.60 లక్షల మెగావాట్లు లభిస్తోందని చెప్పారు.

రాష్ట్రాలకు హక్కులు రావాలని, ఎక్కడో మల్హర్‌ మండలంలో కూలి పని చేస్తే ఢిల్లీ నుంచి పైసలిచ్చే పద్ధతి మారాలన్నారు. ప్రధానమంత్రి సడక్‌ యోజన ఎందుకని కేసీఆర్‌ ప్రశ్నించారు. రోడ్లు వేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం కావాలా అని ఎద్దేవా చేశారు. దేశంలో రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసని ఆయన ధ్వజమెత్తారు. ‘తలసరి విద్యుత్‌ వినియోగం, ఆదాయవృద్ధిలో నంబర్‌ వన్‌గా ఉన్నాం. ఇప్పుడు మన దగ్గర నుంచి కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఏపీకి ధాన్యం ఎగుమతి చేస్తున్నాం. అనేక రంగాల్లో ఇవాళ తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉంది. పరిపాలన చేయరాదని ఎవరైతే అన్నారో.. వాళ్లకు వెయ్యి రెట్లు మెరుగ్గా పనిచేస్తున్నాం. 2014–15లో 24 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండిస్తే.. నేడు 54 లక్షల మెట్రిక్‌ టన్నులు పండిస్తున్నాం. దశాబ్దాలుగా నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు లేరా? వారి హయాంలో పనులు జరగలేదు. రాష్ట్ర విభజన జరిగితే మీకు పరిపాలన చేతగాదన్నారు. కానీ వారికన్నా మెరుగ్గా.. తెలంగాణ అద్భుతంగా ముందుకు పోతున్నది ’అని సీఎం కేసీఆర్‌ వివరించారు.

Next Story
Share it