Telugu Gateway
Politics

కెసీఆర్ పొలిటికల్ ‘టేకోవర్స్’!

కెసీఆర్ పొలిటికల్ ‘టేకోవర్స్’!
X

‘ఈ సారి ఫిరాయింపులు వద్దనుకున్నాను. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళే మా వాళ్ళ ఓట్ల కోసం ప్రయత్నించారు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది.’ ఇదీ తెలంగాణ రాష్ట్ర సమితి, సీఎం కెసీఆర్ కొద్ది రోజుల క్రితం చెప్పిన మాట. కాసేపు అదే నిజం అనుకుందాం. అలాంటప్పుడు కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మాత్రమే పార్టీలో చేర్చుకోవాలి కదా?. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని చేర్చుకోవటం ఎందుకు?. ఆరేపల్లి మోహన్ ను చేర్చుకోవటం ఎందుకు?. కార్తీక్ రెడ్డి ఎమ్మెల్యే కాదు కదా?. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాంతాడ అంత ఉంటుంది. కెసీఆర్ అసలు లక్ష్యం వేరు. ఇప్పటికే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జెండా ఎత్తేసే పరిస్థితి. కనీసం లోక్ సభ ఎన్నికల్లో కూడా టీ టీడీపీ పోటీకి సాహసించలేదు. తెలంగాణలో కాస్తో కూస్తో బలంగా ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీనే. అందుకే ఎడాపెడా ఆ పార్టీకి చెందిన నేతలు అందరినీ టీఆర్ఎస్ లోకి ఆకర్షించుకుంటూ రాజకీయంగా తనకు ఎదురులేని పరిస్థితి కల్పించుకోవాలనేది కెసీఆర్ ప్లాన్. అది కూడా లోక్ సభ ఎన్నికల ముందు ఆ జోష్ మరింత పెంచితే ఎన్నికల్లో కాస్తో కూస్తో లాభం ఉంటుందనేది అసలు లెక్క.

తాజాగా వెలువడిన టీచర్, గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చాయి. కెసీఆర్ చేసే అడ్డోగోలు ఫిరాయింపులపై ముఖ్యంగా విద్యావంతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇది రాబోయే రోజుల్లో లోక్ సభ ఎన్నికల ఫలితాలపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఓ వైపు తెలంగాణ వస్తే తొలి ముఖ్యమంత్రి దళితుడిని చేస్తానన్న కెసీఆర్ ఆ హామీని అమలు చేయలేదు. ఇప్పుడు శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న దళిత నేత మల్లు భట్టి విక్రమార్క ప్రతిపక్ష నేత పదవి కూడా పోయేలా కెసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. గతంలో తెలంగాణ టీడీపీ టీఆర్ఎస్ లో విలీనం అయిందని లేఖ ఇఫ్పించి..మమ అన్పించిన తరహాలోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అలాగే దెబ్బ కొట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి.

తాజాగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ కూడా టీఆర్ఎస్ లో చేరేందుకు రెడీ అయిపోయారు. దీంతో కాంగ్రెస్ గత ఎన్నికల్లో గెలిచిన 19 ఎమ్మెల్యేల్లో ఏకంగా పది మందిని కోల్పోయినట్లు అయింది. కార్పొరేట్ రంగంలో బలవంతపు టేకోవర్లులాగా..తెలంగాణలో కెసీఆర్ రాజకీయ టేకోవర్లు చేస్తున్నారు. పైకి వాళ్లే వచ్చి చేరుతున్నారు అని చెబుతున్నా...లోపల జరిగే వ్యవహారాలు ప్రజలకు తెలియదా?. కొత్త రాష్ట్రం..దేశానికి ఆదర్శంగా మార్చుతానని చెప్పిన కెసీఆర్ ఫిరాయింపుల విషయంలో దేశానికి మోడల్ గా మార్చేలా ఉన్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. పైగా గతంలో కాంగ్రెస్ ఫిరాయింపులు చేయలేదా?. ఇప్పుడు మేం చేస్తే తప్పేంటి అన్న రీతిలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ వ్యాఖ్యానిస్తున్నారు.

Next Story
Share it