Telugu Gateway
Politics

టీఆర్ఎస్ కు షాక్

టీఆర్ఎస్ కు షాక్
X

లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా 16 సీట్లు దక్కించుకోవాలని పోరాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కు ఊహించని షాక్. హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కెసీఆర్ బహిరంగ సభకు జనం హాజరుకాకపోవంటతో ఏకంగా సభనే రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మూడు లోక్ సభ నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేయాలని తలపెట్టినా ఒక్క తలసాని శ్రీనివాసయాదవ్ మాత్రమే కాస్తో కూస్తో జనాన్ని తీసుకొచ్చారని..మిగిలిన వారు ఏ మాత్రం పట్టించుకోకపోవటంతో పార్టీ అధినేత సభను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఓ వైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు దారుణంగా పరాజయం పాలై ఉన్న తరుణంలో ఈ పరిణామం పార్టీకి నష్టం చేస్తుందనే అభిప్రాయం టీఆర్ఎస్ నేతల్లో వ్యక్తం అవుతోంది.

తెలంగాణ జిల్లాలో జరిగిన ఇతర కెసీఆర్ సభలకు జనం బాగానే హాజరైన హైదరాబాద్ సభ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. ఎల్బీ స్టేడియంలో జనం లేరని తెలుసుకున్న కేసీఆర్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. మిర్యాలగూడ సభ నుంచి నేరుగా హైదరాబాద్ లోని తన నివాసానికి వెళ్లిపోయారు. దీంతో సీఎం రావడం లేదని తెలుసుకున్న నాయకులు కూడా సభ నుంచి వెళ్లిపోయారు. నేతల పై కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ తరపున మల్కాజ్ గిరి నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డి, చేవేళ్ల నుంచి రంజిత్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి తలసాని సాయి కిరణ్ యాదవ్ లు పోటీలో ఉన్న విషయం తెలిసిందే.

Next Story
Share it