టీఆర్ఎస్ కు జితేందర్ రెడ్డి షాక్

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి షాక్. లోక్ సభలో ఆ పార్టీ నేత జితేందర్ రెడ్డి కారు దిగి..కమలం గూటికి చేరారు. అధినేత చెప్పినట్లే వింటానని..తనకు ఇంత కంటే పెద్ద పదవి రావొచ్చేమో అని వ్యాఖ్యానించిన ఆయన బిజెపి గూటికి చేరారు. గత కొన్ని రోజులుగా బిజెపికి చెందిన నేతలతో చర్చలు జరుపుతున్నట్లు వచ్చిన వార్తలు తాజా పరిణామాలతో నిజం అని తేలిపోయాయి. లోక్ సభ ఎన్నికల ముందు జరిగిన ఈ పరిణామం టీఆర్ఎస్ కు ఝలక్ వంటిదే అని చెప్పుకోవచ్చు. బుధవారం నాడు ఢిల్లీలో జితేందర్ రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా వేసి అమిత్ షా సాదరంగా ఆహ్వానించారు.
జితేందర్ రెడ్డి చేరికలో బీజేపీ అగ్రనేత రాంమాధవ్ కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు. జితేందర్ రెడ్డి బీజేపీలో చేరడంతో మహబూబ్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డికి కాకుండా మరో నేత మన్నె శ్రీనివాస్ రెడ్డికి కేటాయించడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. టీఆర్‌ఎస్ టికెట్ నిరాకరించిందనే కారణంతోనే బీజేపీలో చేరినట్లు వెల్లడించారు. ఇది ఘర్ వాపసీ లాంటిదని అన్నారు. వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, బీజేపీ ఏ బాధ్యత అప్పగించినా నెరవేరుస్తానని అన్నారు.