చంద్రబాబు సర్కారులో న్యాయం జరగదు
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అరాచకాలకు పాల్పడుతోందని..వాళ్ళే దాడులు చేయించి..వాళ్ళే సిట్ లు నియమిస్తారని ధ్వజమెత్తారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ లేదా థర్ట్ పార్టీతో విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో న్యాయం జరగదని అన్నారు. శుక్రవారం సాయంత్రం వైఎస్సార్ జిల్లా పులివెందులలోని భాకరాపురంలో వైఎస్ వివేకానందరెడ్డి భౌతిక కాయానికి జగన్ నివాళులర్పించారు. ‘‘35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ మృదు స్వభావిగా గుర్తింపు పొందిన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిన అతి కిరాతకంగా ఇంట్లో చొరబడి గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశారు.
వయస్సు రీత్యా చూసినా, వ్యక్తిత్వపరంగా చూసినా ఆయనంత సౌమ్యుడు ఎవరూ లేరు. దర్యాప్తు దారుణంగా, అధ్వానంగా ఉంది. చనిపోతూ లెటర్ రాశారా? డ్రైవర్ పేరు చెప్పి లెటర్‌ను సృష్టించారా? తలమీద ఐదుసార్లు గొడ్డలితో నరికారు. చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్లి బాత్రూంలో పడేసి రక్తం కక్కుకుని చనిపోయినట్లు చిత్రీకరించారు. బెడ్‌రూం నుంచి బాత్రూం వరకు ఎత్తుకెళ్లినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఇది ఒక్కరు చేసిన పని కాదు. కిందపడి స్పృహ తప్పి పడిపోయి చనిపోయారని చెబుతున్నప్పుడు లెటర్ ఎలా రాస్తారు? చంపిన వారే లెటర్ రాయించారా? డ్రైవర్‌పై నెపం నెట్టడం కోసం లెటర్ రాశారా?’’వైఎస్ జగన్ నిలదీశారు.