చిత్తూరు జిల్లాలో టీడీపీకి షాక్
తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సొంత జిల్లా చిత్తూరులో తెలుగుదేశం పార్టీకి షాక్. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్ సి వి నాయుడు శనివారం నాడు టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన ఈ నియోజకవర్గం సీటు ఆశించారు. కానీ చంద్రబాబునాయుడు ఈ టిక్కెట్ ను మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడికి కేటాయించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన నాయుడు పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఆదివారం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్నారు.
ఇది ఖచ్చితంగా టీడీపీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉందని పార్టీ టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నాయుడు పార్టీని వీడటంతో శ్రీకాళహస్తి సీటు పై టీడీపీ ఆశలు వదులుకోవాల్సిందేనని భావిస్తున్నారు. ఒకే ఒక్క రోజు టీడీపీ నుంచి ముగ్గురు కీలక నేతలు..అదీ రాయలసీమ నుంచే అధికార పార్టీ నుంచి జంప్ కావటం టీడీపీలో రాజకీయంగా దుమారం రేపుతోంది.