Telugu Gateway
Politics

తెలంగాణ పోలీస్ వర్సెస్ ఏపీ పోలీస్

తెలంగాణ పోలీస్ వర్సెస్ ఏపీ పోలీస్
X

‘డాటా చోరీ’ వ్యవహారం పూర్తి రాజకీయ రంగు పులుముకుంటోంది. అంతే కాదు..ఇది ఏపీ పోలీస్ వర్సెస్ తెలంగాణ పోలీసుగా కూడా మారుతోంది. ఈ వ్యవహారంలో ఓ వైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహాంతో ఊగిపోతున్నారు. ఆయన ఈ కేసు వ్యవహారంలో ఆగమాగం అవుతున్నట్లు ఆయన మాటలు చూస్తేనే ఎవరికైనా అర్థం అవుతుంది. చంద్రబాబు వ్యాఖ్యలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ స్పందించారు. తప్పు చేయకపోతే ఎందుకు టెన్షన్ పడుతున్నారని ధ్వజమెత్తారు. దొరికిపోయిన ప్రతిసారీ చంద్రబాబు, లోకేష్ లు ఇలా అడ్డంగా మాట్లాడటం మామూలే అంటూ ధ్వజమెత్తారు. ఈ మొత్తం వ్యవహారంపై కేసును విచారణ జరుపుతున్న సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ సోమవారం మీడియాతో మాట్లాడారు. లోకేశ్వర్‌ రెడ్డి ఫిర్యాదుతోనే ఐటీ గ్రిడ్స్‌ లో సోదాలు నిర్వహించామని తెలిపారు. సంస్థకు చెందిన ఉద్యోగులు విక్రమ్‌ గౌడ్‌, చంద్ర శేఖర్‌, ఫణి కుమార్‌, భాస్కర్‌ల సమక్షంలోనే ఆదారాలు సేకరించామని తెలిపారు. కీలకమైన ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లను సీజ్‌ చేసి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపామని చెప్పారు. ఎంక్యాబ్‌ సిరీస్‌ ఎలక్ట్రానిక్‌ పరికరాలను సీజ్‌ చేశామని చెప్పారు. సేవామిత్ర యాప్‌ పేరుతో వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారని, వీటికి సంబంధించిన ఆధారాలు కూడా సోదాల్లో లభించాయన్నారు. ఐటీ గ్రిడ్‌ డేటా అమెజాన్‌ సర్విస్‌లో భద్రపరినట్లు విచారణలో తేలిందన్నారు.

నియోజకవర్గాల వారిగా ఓటర్‌ ఐడీ, ఆధార్‌ కార్డ్‌ సమాచారాన్ని ఐటీ గ్రిడ్స్‌ సంస్థ అక్రమంగా సేకరించిందన్నారు. అక్రమంగా డేటా సేకరించి, ఓట్లు తొలగిస్తున్నట్లు కొంతమంది చేసిన ఫిర్యాదుపై దర్యాప్తును కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌కు నోటీసులు జారీ చేశామని, ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామన్నారు. చట్టం ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తు వ్యవహారంలో ఏపీ పోలీసుల జోక్యం సరికాదని సజ్జనార్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా అశోక్ ను గుర్తించినట్లు తెలిపారు. డేటా హైదరాబాద్ లో దొరికింది కనుకే తాము ఇక్కడ దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అత్యంత కీలకమైన పబ్లిక్ డేటాను యాప్ ల పేరుతో పబ్లిక్ డొమైన్ లో పెట్టడాన్ని ఆక్షిపించారు.

Next Story
Share it