తెలంగాణ సిట్ దూకుడు..ఐటి గ్రిడ్ సీజ్
డేటా చోరీకి సంబంధించిన వ్యవహారం హాట్ హాట్ గా మారుతోంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సిట్ అంటే సిట్ అంటూ సవాళ్ళు విసురుకుంటున్నాయి. ఈ దశలో తెలంగాణ సిట్ మరింత దూకుడు పెంచింది. అందులో భాగంగా డేటా చోరీకి కేంద్రమైన ‘ఐటి గ్రిడ్’ కార్యాలయాన్ని సీజ్ చేశారు. విచారణ కోసం తమ అదుపులోకి తీసుకుంటున్నట్లు సిట్ ప్రకటించింది. ఏపీ ప్రజలు డేటాచోరీ కేసులో గత రెండు రోజులు ఐటీగ్రిడ్స్ సంస్థలో సిట్ సోదాలు చేస్తోన్న విషయం తెలిసిందే.
దర్యాప్తులో భాగంగా కంప్యూటర్లు, హార్డ్ డిస్క్ లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దానిలోని మరింత సమాచారాన్ని సేకరించారు. మరోసారి విచారణకు తమముందుకు హాజరుకావాలని సంస్థ ఉద్యోగులకు సిట్ నోటీసులు జారీచేసింది. మరోవైపు పరారీలో ఉన్న ఐటీగ్రిడ్స్ ఎండీ అశోక్ కోసం గాలింపు కొనసాగుతోంది. కేసును విచారిస్తున్న సిట్ కార్యాలయాన్ని డీజీపీ ఆఫీసు నుంచి గోషామహల్‌కు మార్చుతున్నట్లు అధికారులు తెలిపారు.