Telugu Gateway
Politics

డీఎల్ సంచలన వ్యాఖ్యలు

డీఎల్ సంచలన వ్యాఖ్యలు
X

ఎన్నికల వేళ ఏపీలో రాజకీయాలు అత్యంత సెగలు పుట్టిస్తున్నాయి. తెలుగుదేశం టిక్కెట్ ఆశించి భంగపడిన మాజీ మంత్రి డీ ఎల్ రవీంద్రా రెడ్డి ఆ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క డీఎల్ కాకుండా చాలా మంది నేతలు ఎన్నికల ముందు అధికార టీడీపీపై చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అయితే ఈ వ్యాఖ్యల ప్రభావం, నేతల వ్యవహారం ఆ పార్టీ విజయావకాశాలపై ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది అన్నది ఎన్నికల ఫలితాల వరకూ వేచిచూడాల్సిందే. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడమే తన ధ్యేయమని మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం వైఎస్సార్ జిల్లా ఖాజీపేటలో కార్యకర్తలతో సమావేశం అయ్యారు. రానున్న ఎన్నికల్లో భవిష్యత్‌ కార్యచరణపై డీఎల్‌ ఈ సందర్భంగా కార్యకర్తలతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..టీడీపీ సర్కార్‌ రాష్ట్రంలో పూర్తిగా అవినీతిమయ పాలన కొనసాగిస్తోందని మండిపడ్డారు.

మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు గెలుపొందిన డీఎల్‌ గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో డీఎల్‌...టీడీపీకి మద్దతు ఇచ్చినా ఆ తర్వాత ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. కొద్దిరోజుల క్రితం డీఎల్‌ రవీంద్రారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. మైదుకూరు టికెట్‌ కేటాయించాలని ఈ సందర్భంగా డీఎల్‌ కోరినట్లు సమాచారం. అయితే చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఆయన వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీఎల్‌...టీడీపీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. అదే సమయంలో ఇతర పార్టీలు కూడా తన గురించి ఆలోచించాలని వ్యాఖ్యానించారు.

Next Story
Share it