Telugu Gateway
Politics

ఏపీపై గద్దల్లా వాలుతున్నారు

ఏపీపై గద్దల్లా వాలుతున్నారు
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీని మింగేందుకు కొన్ని గద్దలు సిద్ధమవుతున్నాయని..వాటికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని కోరారు. రాష్ట్రంపై జగన్, కెసీఆర్, మోడీల కుట్రలు మరీ పెరిగిపోయాయని అన్నారు. టిడిపి అభ్యర్ధులకు బెదిరింపులు,నాయకులకు ప్రలోభాలు,కార్యకర్తలకు వేధింపులు ఎక్కువయ్యాయని అన్నారు. ఆర్ధికమూలాలు దెబ్బతీయడం, వదంతులతో అపోహలు సృష్టించడం వీరి పనిగా మారిందని ధ్వజమెత్తారు. గురువారం నాడు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రతి బూత్ కన్వీనర్ అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యర్ధుల ప్రలోభాలను అధిగమించాలి. ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదంటాడు జగన్. ఆంధ్రా వైద్యులపై నమ్మకం లేదంటాడు. తెలంగాణ పోలీసులు కావాలంటాడు. తెలంగాణ ఆసుపత్రుల్లో వైద్యం అంటాడు. కానీ ఆంధ్రలో ఓట్లు మాత్రం జగన్ కావాలంటాడు . చిన్నాన్న హత్యను రాజకీయం చేస్తాడు. తెలుగుదేశం పార్టీపైనే నిందలు వేస్తాడు. కెసిఆర్ నాకు రిటర్న్ గిఫ్ట్ లు అంటాడు. తన మంత్రులను ఏపిపైకి పంపి రెచ్చగొట్టిస్తాడు. జగన్ మేళ్ల కోసమే మోది,కెసిఆర్ అండదండలు. మూడు పార్టీల కుట్రలకు బుద్ది చెప్పాలి. అప్పుడు రైతులకు రుణమాఫీ అసాధ్యమని జగన్ చెప్పారు. ఇప్పుడేమో రైతులపై జగన్ మొసలికన్నీరు. జగన్ నిర్వాకాల వల్ల లక్ష ఎకరాలు నిరుపయోగం. వాన్ పిక్ 28వేల ఎకరాలు,లేపాక్షి 8808ఎకరాలు,బ్రాహ్మణి స్టీల్స్ 10వేల ఎకరాలు. జగన్ కేసులలో చిక్కుకుని ప్రజోపయోగం లేకుండా పోయాయి.

వాటన్నింటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. సమాజానికే పెనుప్రమాదంగా జగన్ మారారు. పులివెందుల హత్యపై డ్రామాల మీద డ్రామాలు. విశాఖలో కోడికత్తి సంఘటన ఇంకో డ్రామా. టిడిపి డేటా చోరీకి భారీ కుట్ర చేశారు. ఫామ్ 7 ద్వారా 9లక్షల ఓట్ల తొలగింపు ఇంకోకుట్ర. ఈ కుట్రలకు జగన్ చేసే మేనిప్యులేషన్, రూమర్లు అదనం. జగన్ కుట్రలకు,డ్రామాలకు అంతేలేకుండా పోయింది. ప్రత్యేక హోదా వైకాపాకు బోరింగ్ సబ్జెక్ట్ అట. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్ధులే చెప్పారు. వీళ్లను ఎంపిలుగా గెలిపిస్తే ఏం చేస్తారు..? మోది మేళ్ల కోసమే రాజీనామాలు చేశారు. ఎన్నిక రాకుండా చూసి రాజీడ్రామా ఆడారు. అవిశ్వాసంలో మోదిని గెలిపించేందుకే వైకాపా ఎంపిల రాజీడ్రామా. రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చే టిడిపికే మద్దతుగా నిలవాలి’ అంటూ వ్యాఖ్యానించారు.

Next Story
Share it