Telugu Gateway
Politics

వ్యవస్థలను పతనం చేస్తే టీడీపీ సహించదు

వ్యవస్థలను పతనం చేస్తే టీడీపీ సహించదు
X

తెలుగుదేశం పార్టీ సభలకు వస్తున్న స్పందన చూసే ఏపీలోని పార్టీలు హడలిపోతున్నాయని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. టీడీపీని ఎలాగైనా దెబ్బకొట్టాలని బిజెపి, వైసీపీ, టీఆర్ఎస్ కలసి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తామంటే టీడీపీ చూస్తూ ఊరుకోదని..తమ పోరాటం ఎవరితో అయినా..ఎందాకైనా చేస్తామని చంద్రబాబు హెచ్చరించారు. ఆయన గురువారం నాడు పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీని దెబ్బతీయటానికి అన్నివ్యవస్థలను తమపై ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. తన ప్రభుత్వంపై టిడిపి అవిశ్వాస తీర్మానం పెట్టిందనే కక్ష మోడీకి ఉందన్నారు. దేశంలోని అన్ని పార్టీలను తెలుగుదేశం ఏకం చేస్తుందనే దుగ్దతోనే తమపై రకరకాల దాడులు చేస్తున్నారని విమర్శించారు.

‘బిజెపి పెడ బుద్దులకు ఆర్ బిఐ గవర్నర్లు రాజీనామా చేసిపోయారు. సిబిఐ భ్రష్టు పట్టే పరిస్థితికి బిజెపి నేతలే తెచ్చారు. ఇప్పుడు ఏకంగా ఈసీకే తూట్లు పొడుస్తున్నారు. తొలిదశ ఎన్నికలు కాబట్టే ఏపిపై మోది ప్రతాపం. ప్రతిఒక్కరికి హద్దులు ఉంటాయి, పరిమితులు ఉంటాయి. ప్రజల ఆమోదం మేరకే ఏపార్టీకైనా అధికారం. న్యాయం కోసం, ధర్మం కోసం పోరాటం కొనసాగిస్తాం. నైతికంగా తెలుగుదేశం పార్టీ ఎంతో బలమైంది. ఎవరితోనైనా ఢీకొంటాం, అధర్మాన్ని సరిదిద్దుతాం. 31కేసులున్న వాళ్ల ఫిర్యాదుల్లో ఏమైనా చిత్తశుద్ది ఉంటుందా..?అరాచకాలు చేసేది జగన్మోహన్ రెడ్డి. వాటిపై నెపం వేసేది తెలుగుదేశం పార్టీపై. టిడిపిపై చర్యలు తీసుకోమని ఈసి కి ఫిర్యాదులు. నిందితులు ఫిర్యాదులు చేస్తే ఈసి ఆగమేఘాలపై చర్యలా..?

అదే వీవీ ప్యాట్ రశీదులపై 22పార్టీలు అడిగితే ఈసీ ససేమిరా అంటారా..? నేరస్తులే పోలీసులపై ఫిర్యాదులు చేయడం ఏమిటి...?. నేరస్థుల ఫిర్యాదులకు ఆగమేఘాలపై ఈసి స్పందించడమా..? ఈ అరాచకాలు అన్నింటికీ మోది వంత పాడటం ఏమిటి..?. తప్పులు చేయడం-రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోవడం..ప్రత్యర్ధులపై నిందలు వేయడం జగన్ నైజం. తప్పించుకునే కుట్రలు జగన్ కు అలవాటే. మృత దేహంతో వేలిముద్రలు వేయించిన చరిత్ర వైకాపా నేతలది. జడ్జిలనే జైళ్లకు పంపిన ఘనులు వైకాపా నేతలు. జగన్ పై సిబిఐ కేసులు,ఈడి కేసులు. రూ.లక్ష కోట్ల అవినీతి, లక్షలాది ఓట్ల తొలగింపు,డేటా చోరీ,చిన్నాన్న హత్య, కోడికత్తి కేసు అంతా జగన్మాయే, జగన్నాటకాలే. ’ అంటూ వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Next Story
Share it