Telugu Gateway
Politics

కుప్పంలో భారీగా తగ్గనున్న చంద్రబాబు మెజారిటీ!?

కుప్పంలో భారీగా తగ్గనున్న చంద్రబాబు మెజారిటీ!?
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఈ సారి మెజారిటీ భారీగా తగ్గనుందా?.అంటే ఔననే అంటున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు. ఈ నియోజకర్గంలో చంద్రబాబు గెలుపునకు ఢోకా లేకపోయినా..మెజారిటీ మాత్రం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే కుప్పం నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయల పనులు జరిగినా కూడా అక్కడ టీడీపీ నేతల అవినీతి అంశం దీని కంటే ఎక్కువ ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. ఈ సారి చంద్రబాబు మెజారిటీ తగ్గటానికి ఇదే ప్రధాన కారణం కానుందని టీడీపీ నాయకులే అభిప్రాయపడుతున్నారు. స్థానిక టీడీపీ నేతలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అది వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉందని..దీని వల్ల గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి చంద్రబాబుకు మెజారిటీ తగ్గటం ఖాయం అని ఎక్కువ మంది అభిప్రాయం. 2014 ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి 47121 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అంతకు ముందు ఎన్నికల కంటే ఇది చాలా తక్కువ. గతంలో వైసీపీ నుంచి ప్రత్యర్ధిగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళినే ఈ సారి కూడా ఆ పార్టీ తరపున చంద్రబాబుతో తలపడుతున్నారు.

అయితే ఈ సారి చంద్రబాబు మెజారిటీ మరింత తగ్గుతుందనే అంశంపై టీడీపీ నేతల్లో ఆందోళన పెంచుతోంది. ఓ వైపు రాష్ట్రంలో టీడీపీ మిషన్ 150 టార్గెట్ పేరుతో పనిచేస్తుందని చెబుతున్న చంద్రబాబు ప్రతి ఏటా తన మెజారిటీ తగ్గుతున్నా పట్టించుకోవటంలేదనే వ్యాఖ్యాలూ విన్పిస్తున్నాయి. అయితే ఓ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో జరగాల్సినంత అభివృద్ధి మాత్రం జరగలేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడాదిలోనే ఏకంగా సీఎం నియోజకవర్గంలోని బాలికల పాఠశాలల్లో కనీస సౌకర్యాలైన టాయిలెట్లు కూడా లేవని వైసీపీ విమర్శించటం, అందుకు మంత్రి గంటా శ్రీనివాసరావు అసెంబ్లీ సాక్షిగా అంగీకరించటం అప్పట్లో కలకలం రేపింది. సీఎం నియోజకవర్గంలో అభివృద్ధి కంటే అవినేతే ఎక్కువ ఉందనే అభిప్రాయం ఆ నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు.

Next Story
Share it