Telugu Gateway
Politics

చంద్రబాబు తనపై తాను నమ్మకం కోల్పోయారా?

చంద్రబాబు తనపై తాను నమ్మకం కోల్పోయారా?
X

దేశంలోని స్వయం ప్రకటిత అత్యంత సీనియర్ నేత, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తనపై తాను నమ్మకం కోల్పోయారా?. చివరకు ఈ ఎన్నికల నుంచి గట్టెక్కించేందుకు బీహార్ కు చెందిన లాలూప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్ ను కూడా ఏపీ ఎన్నికల ప్రచారంలో దింపుతున్నారు. ఓ వైపు బీహారి రాజకీయాలు ఏపీలో సాగవు..బీహార్ బందిపోటు వంటి వ్యాఖ్యలు చేసిన చంద్రబాబునాయుడు ఇప్పుడు తన రాజకీయ ప్రయోజనాల కోసం తీవ్ర స్థాయి అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన లాలూ తనయుడు తేజస్వి యాదవ్ ను ప్రచారం కోసం పిలుపించు కోవటంతోనే చంద్రబాబునాయుడు ఎంత ఫ్రస్టేషన్ లో ఉన్నారో తెలిసిపోతుందని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే ఫరూక్ అబ్దుల్లా కడప, కర్నూలు జిల్లాల్లో టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో మమతా బెనర్జీతోపాటు అరవింద్ కేజ్రీవాల్, హెచ్ డి దేవగౌడ వంటి వారిని కూడా ప్రచారానికి తెచ్చుకునే పనిలో చంద్రబాబు ఉన్నారు. టీడీపీనే తమ పార్టీ తరపున ప్రచారం చేయనున్న నాయకుల జాబితాను తాజా గా విడుదల చేసింది.

ఓ ప్రాంతీయ పార్టీ తన గెలుపు కోసం ఏకంగా ఇంత మంది ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలను ఆహ్వానించటం బహుశా ఇదే మొదటిసారి కావొచ్చు. పలుమార్లు భావసారూప్య పార్టీల ఉమ్మడి సమావేశాలు జరిగాయి కానీ.. ఓ పార్టీ ప్రచారం కోసం ఇలా విడివిడిగా వచ్చి ప్రచారాలు చేసిన సందర్భాలు లేవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చంద్రబాబునాయుడు తనపై తాను నమ్మకం కోల్పోయారు కాబట్టే ఇలాంటి నేతలపై ఆధారపడుతున్నారనే వ్యాఖ్యలు కూడా విన్పిస్తున్నాయి. తేజస్వి యాదవ్, మమతా బెనర్జీ, ఫరూక్ అబ్దుల్లాల ప్రచారం చేయటం వల్ల ఏపీ ప్రజల ఆలోచన విధానంలో మార్పు వస్తుందా?. చంద్రబాబుకు ఓట్లు అలా వచ్చి పడతాయా? అంటే ఏ మాత్రం ఛాన్స్ లేదని చెబుతున్నారు. మరి చంద్రబాబు చేసే ఈ ప్రయత్నాలు ఏ మేరకు ఫలితాన్ని ఇస్తాయో ఫలితాల వరకూ వేచిచూడాల్సిందే.

Next Story
Share it