Telugu Gateway
Politics

జగన్ లో ఓటమి భయం

జగన్ లో ఓటమి భయం
X

వైసీపీ అధినేత జగన్ లో ఓటమి భయం స్పష్టంగా కన్పిస్తోందని తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. సహజంగా ఎక్కడ పోటీచేసే అభ్యర్దులు అక్కడే నివాసం ఉండాలి కానీ..జగన్ మాత్రం నిత్యం హైదరాబాద్ లో ఉంటూ ఏపీకి చుట్టపు చూపుగా వస్తున్నారని వ్యాఖ్యానించారు. బుధవారం టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ వైఖరి పోటీ చేసేది ఒక రాష్ట్రంలో, నివాసం ఉండేది ఇంకో రాష్ట్రంలో అన్న చందంగా తయారైందన్నారు. ఏపీలో ఉంటే ఆయనకు ముళ్ళ మీద ఉన్నట్లే ఉందని..వచ్చినా రాత్రికి మళ్లీ వెనక్క పోవాల్సిందే అన్నారు. మోది,కెసిఆర్ ఆదేశాల మేరకే వైసిపి అభ్యర్ధుల ఎంపిక సాగుతోందని విమర్శించారు. ‘హెలికాప్టర్’ గుర్తు చూసి కూడా జగన్ కు భయం. ‘హెలికాప్టర్’ పై ఫ్యాన్ ఉందంటూ ఈసికి ఫిర్యాదు’ చేశారని ఎద్దేవా చేశారు.

రెండు రోజుల్లో టీడీపీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాల లబ్దిదారులంతా టిడిపికే మద్ధతు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. ‘రాష్ట్ర భవిష్యత్తు కోరేవాళ్లంతా టిడిపి వెంటే నడుస్తారు. ఇంటింటికీ వెళ్లాలి, 5ఏళ్లలో మనం చేసింది చెప్పాలి. ప్రతి కుటుంబం మద్దతు టిడిపికి కూడగట్టాలి. 40ఏళ్లలో లేనంత పకడ్బందీగా టిడిపి అభ్యర్ధుల ఎంపిక. ప్రజల్లో ఆదరణ, కార్యకర్తల అభిమానమే టిడిపిలో ప్రాతిపదిక. వైసిపి అభ్యర్ధుల ఎంపికకు ‘వేలం పాటే’ ప్రాతిపదిక. ఎవరెక్కువ పాడుకుంటే వాళ్లకే వైసిపి టిక్కెట్లు. ఎస్సీ అభ్యర్ధులు వైసిపిలో రూ.10కోట్లు డిపాజిట్ చేయాలట. ఓసి అభ్యర్ధులు వైసిపిలో రూ.20కోట్లు డిపాజిట్ చేయాలట. ఇలాంటి వైసిపికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు.’ అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it