Telugu Gateway
Politics

చంద్రబాబు ‘దోపిడీ మిషన్’ ఇరిగేషన్..ఐదేళ్ళలో 30వేల కోట్ల దోపిడీ!

చంద్రబాబు ‘దోపిడీ మిషన్’ ఇరిగేషన్..ఐదేళ్ళలో 30వేల కోట్ల దోపిడీ!
X

అంచనాలు పెంచుకో..అందినంత దండుకో

26 ప్రాజెక్టుల వ్యయం 40 వేల కోట్ల నుంచి లక్ష కోట్లకు పెంపు

ఐదేళ్ళు. ఒక్క శాఖ. దోపిడీ మొత్తం తక్కువలో తక్కువ 30 వేల కోట్ల రూపాయల పైమాటే. ఇదీ ఆంధ్రప్రదేశ్ లోని సాగునీటి శాఖలో జరిగిన దోపిడీ వ్యవహారం. అసలు తాను కష్టపడేది ప్రజల కోసం తప్ప..తన కోసం కాదన్నట్లు కలరింగ్ ఇచ్చే ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అసలు రంగు ఇది. ఏపీలో చేపట్టిన 26 ప్రాజెక్టులకు సంబంధించి తొలి అంచనా 41 వేల కోట్ల రూపాయలు అయితే..అంచనాల పెంపు ద్వారా ఇది ఏకంగా 98,442 కోట్ల రూపాయలకు పెరిగింది. ఐదేళ్ల కాలంలో ఎంతో కొంత ధరల పెరుగుదల ఉండటం వాస్తవమే. కానీ పెంచిన అంచనాలకు..ధరల పెరుగుదలకు మధ్య వ్యత్యాసం మాత్రం ఏ మాత్రం సహేతుకంగా లేదని..ప్రాజెక్టుల పేరు చెప్పి అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారని సాగునీటి శాఖ వర్గాలే చెబుతున్నాయి. కొన్ని ప్రాజెక్టులను అయితే కేవలం దోపిడీ కోసమే డిజైన్ చేశారని అధికారులు పేర్కొంటున్నారు. ఒక్క సాగునీటి శాఖలోనే ప్రభుత్వ పెద్దల దోపిడీ మొత్తం 30 వేల కోట్ల రూపాయల పైనే ఉందంటే అన్ని శాఖల్లో కలుపుకుని ఈ ఐదేళ్ల కాలంలో సాగిన దోపిడీ ఊహించటమే కష్టం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ప్రాజెక్టుల పూర్తి కంటే ‘కమిషన్ల వ్యవహారం’పైనే ఈ సర్కారు ఎక్కువ ఫోకస్ పెట్టింది. అడ్డగోలు అంచనాల పెంపు క్రమంలో ఆర్థిక శాఖతో పాటు ప్రభుత్వంలోని ఉన్నతాధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ సర్కారు ముందుకు సాగింది. అంతే కాదు..పలు ప్రాజెక్టులకు సంబంధించి కాంట్రాక్టర్లను కూడా తొలగించి అస్మదీయులకు పనులు అప్పగించటం ద్వారా పక్కా పథకం ప్రకారం దోపిడీకి స్కెచ్ వేశారు. ప్రతిపక్షంలో ఉండగా ధరల సర్దుబాటు అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు తాను అధికారంలోకి రాగానే..అదే రైట్ అంటూ అడ్డగోలుగా జీవోలు జారీ చేయించి దోపిడీకి తెరలేపారు. ఈ వ్యవహారంలోనూ ఆర్ధిక శాఖ అభ్యంతరాలను పట్టించుకోకుండా ప్రతి దోపిడీకి ‘కేబినెట్ ఆమోదం’ అనే కాన్సెప్ట్ ను తెరపైకి తెచ్చి ఇష్టారీతిన ప్రజల సొమ్మును దోపిడీ చేశారు. ఈ అంశాలు అన్నింటిని పక్కన పెట్టి ఇప్పుడు ఎన్నికల్లో గెలిచేందుకు అపర భగీరధుడుగా కలరింగ్ ఇఛ్చే ప్రయత్నాల్లో మునిగిపోయారు.

Next Story
Share it