Telugu Gateway
Andhra Pradesh

5.85 లక్షల ఫైబర్ నెట్ కనెక్షన్లు..4000 కోట్ల అప్పు

5.85 లక్షల ఫైబర్ నెట్ కనెక్షన్లు..4000 కోట్ల అప్పు
X

ఇదీ చంద్రబాబు ప్రాధాన్యత

స్కామ్ కోసమే ‘ఫైబర్ నెట్ ప్రాజెక్టు’

విభజన తర్వాత ఏపీకి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యేంత వరకూ రాష్ట్ర ప్రజలకు టీవీ కనెక్షన్లే లేవా?. ప్రజలు టీవీలే చూడలేదా?. ఎవరూ నెట్ వాడుకోలేదా?. తాజాగా ఓ ఎన్నికల ప్రచార సభలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ 200 ఛానెళ్ళతో తాను విజ్ణానాన్ని ప్రజలకు పంచుతున్నట్లు ప్రకటించుకున్నారు. ఇది విన్న వారు అవాక్కు అయ్యారు. కొత్తగా వచ్చిన ‘ట్రాయ్’ ఆదేశాలతో ఈ ఫైబర్ నెట్ టారిఫ్ ప్లాన్ కూడా మారిపోయి ప్రజలపై మరింత భారం పడటం ఖాయంగా కన్పిస్తోంది. అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఈ ప్రాజెక్టుపై ఊదరగొట్టారు. తొలి ఏడాదిలోనే పది లక్షలకు పైగా కనెక్షన్లు ఇస్తామని ఘనంగా ప్రకటించుకున్నారు. కానీ 2018 డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్టు కింద కేవలం 5.85 లక్షల కనెక్షన్లు మాత్రమే ఇచ్చారు. పోనీ ఇది ఏమైనా సరిగా చేస్తున్నారా? అంటే చైనా నుంచి నాసిరకం సెట్ టాప్ బాక్స్ లు తెస్తూ చెన్నయ్ ఓడరేవులో కస్టమ్స్ అధికారులకు దొరికిపోయారు.

ఫైబర్ నెట్ ప్రాజెక్టు కేటాయింపు దగ్గర నుంచి ప్రతి వ్యవహారంలోనూ గోల్ మాల్ జరిగిన విషయం తెలిసిందే. ఓ వైపు విభజనతో ఎన్నో కష్టాలు పడుతున్నామని..ఏపీ తీవ్రమైన ఆర్థిక లోటుతో ఉందని జపం చేసే చంద్రబాబునాయుడు ఏకంగా ఈ ప్రాజెక్టు కింద 4000 కోట్ల రూపాయలు అప్పు చేసేందుకు ఎడాపెడా అనుమతులు ఇచ్చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీకి ఇది అంత తక్షణ అవసరమా?. ఓ వైపు జియోలాంటి కొత్త సర్వీస్ ప్రొవెడర్లతో ప్రతి పల్లెకూ నెట్ అందుబాటులోకి వచ్చింది. ఈ తరుణంలో సర్కారు అప్పులు చేసి ఈ దందా చేయాల్సిన అవసరం ఏముందని అధికార వర్గాలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

అస్మదీయ సంస్థకు కాంట్రాక్ట్ లు కట్టబెట్టి ప్రాజెక్టు పేరుతో భారీ ఎత్తున దోపిడీ చేసేందుకే ఈ స్కీమ్ వేశారని ఆ శాఖ వర్గాలే పేర్కొంటున్నాయి. తొలుత ఈ ప్రాజెక్టు కింద 300 కోట్ల రూపాయలు, తర్వాత 411 కోట్ల రూపాయల రుణానికి సర్కారు గ్యారంటీ ఇచ్చింది. తర్వాత మరో 3283 కోట్ల రూపాయల రుణానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇఛ్చింది. ఫైబర్ గ్రిడ్ సామర్ధ్యాన్ని 12.5 మిలియన్లు అంటే (1.25 కోట్ల) సబ్ స్క్రైబర్ల సంఖ్యకు పెంచేందుకే ఈ రుణం మంజూరు చేశారు. పోనీ ఈ ఫైబర్ నెట్ కనెక్షన్లు ఏమైనా క్వాలిటీ సర్వీసులు అందిస్తున్నాయా? అంటే అత్యంత నాసిరకంగా ఉన్నాయి. వినియోగదారులు కూడా ఈ సర్వీసులతో తీవ్ర అసౌకర్యానికి గురై..వెంటనే ఇతరసర్వీసులకు మారిపోతున్నారు. ఇదీ ‘విజన్’తో కూడిన చంద్రబాబు సర్కారు తీరు.

Next Story
Share it