మళ్లీ నువ్వే రావాలి..రాజధాని భూములు దోచుకోవాలి
రాజధాని భూములతో ‘లక్ష కోట్ల’కు చంద్రబాబు స్కెచ్
అమ్మకానికి 8274 ఎకరాల భూమి కేటాయింపు
అందులో ‘దోపిడీ’ వాటా ఎంతో?
రాజధాని అమరావతి పేరుతో తొలి దశ దోపిడీ ముగిసింది. భవిష్యత్ దోపిడీకి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పక్కాగా స్కెచ్ వేసి మరీ పెట్టుకున్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఆ భూములు అమ్మి ఎలా సొమ్ము చేసుకోవాలో లెక్కలేసుకుని కూర్చున్నారు. ఈ మేరకు సర్కారు ఏకంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. భవిష్యత్ అమ్మకాల కోసం రైతుల దగ్గర నుంచి సేకరించిన దాంట్లో 8274 ఎకరాలు అట్టిపెట్టారు. ఇది చూస్తే రాజధాని పేరుతో అమరావతి రైతులను చంద్రబాబునాయుడు ఎంత దారుణంగా మోసం చేస్తున్నారో కళ్లకుకట్టినట్లు కనపడుతుంది. ఉదాహరణకు ఓ చోట రైతుకు పది ఎకరాల పొలం ఉంటే... ఆ పొలం పక్కన రాజధానో..లేక మరో ప్రభుత్వ కార్యాలయమో వస్తే సహజంగానే ఆ భూమికి విలువ అమాంతం పెరుగుతుంది. రైతుల దగ్గర అవసరం లేకపోయినా సర్కారే ఆ భూమి తీసుకుని..అందులో వ్యాపారం చేసుకుంటానంటే..అంత కంటే దుర్మార్గం ఉంటుందా?. అచ్చం చంద్రబాబు సర్కారు ఇప్పుడు అదే చేస్తోంది.
ఇప్పటికిప్పుడు భూమి అమ్మితే ఎక్కువ ధర రాదని..2023 సంవత్సరం నుంచి ఏకంగా 8274 ఎకరాలను అమ్మటానికి రంగం సిద్ధం చేసింది సర్కారు. దీని ద్వారా ఏకంగా లక్ష కోట్ల రూపాయలపైనే సమకూర్చుకోవటానికి రంగం సిద్ధం చేసుకుంది. అంటే ఇప్పటికే సింగపూర్ సంస్థలకు స్విస్ ఛాలెంజ్ పథకంలో దోచిపెట్టిన వేలాది ఎకరాలకు తోడు..ఇది అదనం అన్న మాట. సింగపూర్ సంస్థలే కాదు..దేశీయ అస్మదీయ సంస్థలకు కూడా వందల ఎకరాల కేటాయింపులు..దోపిడీలు నిన్నమొన్నటివరకూ అప్రతిహతంగా సాగాయి. అవసరం లేకపోయినా రైతుల భూములు తీసుకుని..ఆ భూములతో సర్కారు వ్యాపారం చేయటం ఏమైనా న్యాయమా?.
చంద్రబాబునాయుడి ‘దోపిడీ స్కెచ్’ అర్థం చేసుకోవటం ఎవరికైనా అంత ఈజీ కాదు. అది అర్థం కాకుండా ఉండటం కోసం అరచేతిలో వైకుంఠం చూపించటంలో ఆయన స్పెషలిస్టు అన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం గుర్తించిన 8274 ఎకరాల్లో 5020 ఎకరాలను పూర్తిగా వాణిజ్య అవసరాలకు కేటాయించి..నిధులు సమీకరించనున్నారు. మిగిలిన 3254 ఎకరాలను మాత్రం ఆర్థికాభివృద్ధికి ఉపయోగిస్తారంట. ఇది కూడా మరో తరహా దోపిడీ స్కీమ్ అన్న మాట. రాజధాని ప్రాంతంలో మౌలికసదుపాయల కల్పనకు కూడా రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములను తనఖా పెట్టే నిధులు సమీకరించుకోనున్నారు. రాజధాని వల్ల రైతులకు ఏమి ప్రయోజనం కలుగుతుందో లేదో తెలియదు కానీ..ప్రభుత్వ పెద్దలు మాత్రం భారీ ఎత్తున ‘దోపిడీ’కి స్కెచ్ వేశారని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. రైతులిచ్చిన భూములను ‘దీర్ఘకాలిక దోపిడీ’కి చాలా ముందస్తు స్కెచ్ వేశారనే విషయాన్ని తాజా జీవో స్పష్టం చేస్తోంది.