Telugu Gateway
Andhra Pradesh

ఐదేళ్ళలో బీసీలకు 75 వేల కోట్లు

ఐదేళ్ళలో బీసీలకు 75 వేల కోట్లు
X

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ‘బీసీ గర్జన’ సభలో బీసీలపై వరాల జల్లు కురిపించారు. గత ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఏటా బీసీలపై పది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పి..కేవలం 3000 కోట్ల రూపాయలు మాత్రమే వ్యయం చేశారన్నారు. ప్రజల ఆశీర్వాదంతో తాము అధికారంలోకి వస్తే ఏటా 15 వేల కోట్ల రూపాయల లెక్కన ఐదేళ్ళలో బీసీలపై 75 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని వెల్లడించారు. అంతే కాదు..బీసీ విద్యార్ధులు ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి విద్యను ఉచితంగా అందిస్తామని తెలిపారు. నామినేటెడ్ పదవుల్లో తాము అధికారంలోకి వచ్చాక బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని తెలిపారు. ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ల్లోనూ వాళ్ళకు సగం వాటా దక్కేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్ బీసీలపై భారీ వరాల వర్షం కురిపిస్తూ ‘బీ సీ డిక్లరేషన్’ ప్రకటించారు. ప్రతి కులానికి కార్పొరేషన్ పెట్టడమే కాకుండా..ప్రతి ఏటా పక్కాగా వాళ్ళకు నిధులు అందేలా చేస్తామని తెలిపారు. ఏలూరులో ఆదివారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బీసీ గర్జన సభ జరిగింది. ఇందులోనే జగన్ పలు కీలక ప్రకటనలు చేశారు.

బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పిస్తామని, తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే సమగ్ర బీసీ సబ్‌ప్లాన్‌ చట్టాన్ని తీసుకొస్తామని వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. బీసీల్లోని 139 కులాలకు విడివిడిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 45 ఏళ్లు నిండిన ప్రతి బీసీ మహిళకు వైఎస్సార్‌ చేయూత కింద రూ. 75వేలు నేరుగా అందజేస్తామని ప్రకటించారు. గ్రామ వాలంటీర్లు నేరుగా మీ ఇంటికి వచ్చి వైఎస్సార్‌ చేయూత కింద డబ్బును పంపిణీ చేస్తారని వెల్లడించారు. బీసీలకు ప్రతి ఏడాది రూ. 10వేల కోట్లు కేటాస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. గత ఐదేళ్లలో రూ. 60వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా.. కేవలం రూ. 18వేల కోట్లు మాత్రమే కేటాయించారని గుర్తు చేశారు.

బీసీల్లోని ప్రతి కులానికి మేలు చేసేలా స్కీమ్ లు ప్రకటించారు. షాపు ఉన్న ప్రతి నాయి బ్రాహ్మణుడికి ఏటా పది వేల రూపాయల సాయం అందిస్తామని ప్రకటించారు. ఇంట్లో మగ్గం ఉంటే రెండు వేల రూపాయలు ఇస్తామని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే తెలంగాణలో బీసీల జాబితా నుంచి తొలగించిన వారి గురించి ముఖ్యమంత్రి కెసీఆర్ తో చర్చిస్తానని జగన్ తెలిపారు. హరికృష్ణ శవం పక్కన కూర్చుని పొత్తుల గురించి మాట్లాడిన చంద్రబాబుకు ఈ అంశంపై మాట్లాడటానికి మాత్రం నోరురాలేదని జగన్ ఎద్దేవా చేశారు.

Next Story
Share it