Telugu Gateway
Cinema

యాత్ర’ మూవీ రివ్యూ

యాత్ర’ మూవీ రివ్యూ
X

టాలీవుడ్ లో ఎన్నడూ లేని రీతిలో ‘బయోపిక్’ల సీజన్ నడుస్తోంది. అందులో భాగంగానే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పాదయాత్రకు సంబంధించిన కీలక అంశాలతో కూడిన బయోపిక్ ‘యాత్ర’ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజశేఖరరెడ్డి పాత్రకు మళయాళ సూపర్ స్టార్ ‘మమ్ముట్టి’ని ఎంపిక చేయటం ద్వారానే దర్శకుడు మహి వి రాఘవ తొలి సక్సెస్ సాధించారని చెప్పొచ్చు. అచ్చు రాజశేఖరరెడ్డి పాత్రలో మమ్ముట్టి వందకు వంద శాతం ఒదిగిపోయారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న రాజశేఖరరెడ్డి చాలా కాలం పార్టీలో బలమైన గ్రూపు లీడర్ గానే ఉన్న విషయం తెలిసిందే. గ్రూపు లీడర్ గా ఉంటే అనుకున్న రాజకీయ లక్ష్యం అందుకోవటం కష్టం అని గ్రహించి..‘కడప దాటి గడపగడప’కూ చేరాలనే లక్ష్యంతో ‘పాదయాత్ర’కు ప్లాన్ చేయటం..అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ అమలు చేసిన అత్యంత కీలకమైన పథకాలైన ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్ మెంట్, ఉచిత విద్యుత్ కు ‘ప్రేరణ’ ఎక్కడ నుంచి వచ్చిందో దర్శకుడు మహీ వి రాఘవ సినిమాలో పర్పెక్ట్ గా చూపించటంలో సక్సెస్ అయ్యారు.

2004 ఎన్నికలకు ముందు రైతుల కష్టాలు..అప్పటి పరిస్థితులను కూడా సినిమాలో చూపించటంతో పాటు..ఫస్టాఫ్ అంతా ‘భావోద్వేగాల’ను పండించటంలో సక్సెస్ అయ్యారు. సెకండాఫ్ కంటే సినిమా ఫస్టాఫ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. సెకండాఫ్ లో వైఎస్ ప్రమాణ స్వీకారం..తొలి ఫైలుపై సంతకాలకు సంబంధించిన ఒరిజినల్ క్లిప్పింగ్ లను చిత్రంలో చూపించారు. తన సాయం కోరి ఇంటికి వచ్చిన మహిళ రాజకీయంగా శత్రువు అయినా సరే అండగా నిలబడటం..పార్టీ టిక్కెట్ల విషయంలో అధిష్టానం వైఖరితో వైఎస్ ఘర్షణను కళ్లకు కట్టినట్లు చూపారు. పాదయాత్రకు పర్మిషన్..టిక్కెట్ల కేటాయింపు విషయంలో వైఎస్ అధిష్టానంతో వ్యవహరించిన తీరు ఆసక్తికరంగా చూపారు.

ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ను పోలిన క్యారెక్టర్ సినిమాలో నవ్వులు పూయించింది. సినిమా అంతా మమ్ముట్టి..కెవీపీ పాత్ర పోషించిన రావు రమేష్ చుట్టూనే తిరుగుతుంది. పాత్ర నిడివి తక్కువ ఉన్నా రాజారెడ్డి పాత్ర పోషించిన జగపతిబాబు, గౌరు చరితా రెడ్డి పాత్ర పోషించిన అనసూయ, సబితా ఇంద్రారెడ్డి పాత్ర పోషించిన సుహాసిని తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. దర్శకుడు మహి వి రాఘవ ఓవరాల్ గా ‘యాత్ర’ సినిమా ను పర్ఫెక్ట్ గా తెరకెక్కించారని చెప్పొచ్చు. రాజకీయ కోణంలో చూసేవారి గురించి చెప్పలేం కానీ..సినిమాను సినిమాపరంగా చూస్తే మాత్రం ‘యాత్ర’ నిస్సందేహంగా ఓ మంచి సినిమా. వైఎస్ అభిమానులకు అయితే ఇది వందకు వంద శాతం నచ్చే సినిమానే.

రేటింగ్. 3.5/5

Next Story
Share it