Telugu Gateway
Politics

రాహుల్ ప్రకటన వైసీపీకి గేట్లు తెరవటమేనా?!

రాహుల్ ప్రకటన వైసీపీకి గేట్లు తెరవటమేనా?!
X

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరుపతి వేదికగా చేసిన ఓ ప్రకటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇది ‘వ్యూహాత్మకం’గా చేసిన ప్రకటనా? లేక తమ చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు రాహుల్ ఈ కామెంట్ చేశారా?. తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో ఇప్పుడు రాహుల్ గాంధీ దోస్తాన కొనసాగుతోంది. అందుకే ఏపీలోని అధికార పార్టీపై ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా వదిలేశారు. దీనిపై పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ వచ్చే ఎన్నికల్లో ఏపీలో ‘ఎవరు అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇస్తుంది’ అన్న ప్రకటన అత్యంత కీలకంగా మారింది. అసలు రాహుల్ గాంధీ ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది. అంటే ప్రస్తుతంతో తమతో ఉన్న టీడీపీతో పాటు భవిష్యత్ లో ప్రతిపక్ష వైసీపీకి కూడా కాంగ్రెస్ ‘గేట్లు’ తెరిచే ఉన్నాయనే సంకేతాలు ఈ సభ ద్వారా రాహుల్ గాంధీ పంపించారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీకి చెందిన అత్యున్నత నిర్ణాయక మండలి అయిన సీడబ్ల్యూసీ ఏపీకి ప్రత్యేక హోదాపై తీర్మానం చేసింది కూడా. ఈ సమయంలో రాహుల్ గాంధీ ఏపీలో ‘ఎవరు అధికారం’లోకి వచ్చినా అనే అంశాన్ని ప్రస్తావించటం అత్యంత కీలకంగా మారింది. గత కొంత కాలంగా జాతీయ సర్వేలు అన్నీ వైసీపీకి అనుకూలంగా ఫలితాలను చూపుతున్నాయి. వైసీపీ కూడా మొదటి నుంచి కూడా ప్రత్యేక హోదాకు ఎవరు ఇస్తారో వారికే మద్దతు ఇస్తామని ప్రకటిస్తూ వస్తోంది. ఈ తరుణంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అత్యంత కీలకంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ లు తమ స్నేహన్ని కొనసాగిస్తూనే విడివిడిగానే పోటీచేస్తాయని చెబుతున్నారు. మరి ఈ ప్రకటనతో రాజకీయాల్లో ఎన్ని మార్పులు చోటుచేసుకుంటాయో వేచిచూడాల్సిందే. మొత్తానికి రాహుల్ గాంధీ తన ప్రకటన ద్వారా ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు కారణమయ్యారు.

Next Story
Share it