Telugu Gateway
Politics

నారా లోకేష్ కు గెలుపు ధీమా రావటం లేదా?

నారా లోకేష్ కు గెలుపు ధీమా రావటం లేదా?
X

వచ్చే ఎన్నికల్లో నారా లోకేష్ ఓ నియోజకవర్గం నుంచి పోటీచేస్తారు?. చాలా మంది నియోజకవర్గాలు ఖరారు అవుతున్నాయి. కానీ నారా లోకేష్ ఎక్కడ నుంచి బరిలో దిగుతారు అన్న అంశంపై మాత్రం పార్టీలో అంతా గప్ చుప్ గా ఉన్నారు. తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్, ఐటి శాఖల మంత్రిగా ఉన్న నారా లోకేష్ కు తన గెలుపుపై నమ్మకం కలగటం లేదా?. చివరి నిమిషం వరకూ ఎమ్మెల్సీ పదవి పట్టుకుని వేలాడాలి అనుకుంటున్నారా?. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రామ సుబ్బారెడ్డిలకు ఉన్న ధైర్యం నారా లోకేష్ కు లేదా?. ఎన్నికల్లో గెలిచిన తర్వాతే నారా లోకేష్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా?. అప్పటివరకూ చేయరా?. ఇదీ పార్టీ వర్గాల్లో సాగుతున్న చర్చ. ఎన్నికల బరిలో నిలిచేందుకు ఇంకా సమయం ఉన్నా కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రామ సుబ్బారెడ్డి తమ పదవులను వదులుకున్నారు. మరి దొడ్డిదారిన రాజకీయాల్లోకి ప్రవేశించిన లోకేష్ కు తనపై తనకు నమ్మకం ఇంకా కలగటం లేదా?. ఆయన పార్టీ క్యాడర్ కు, నేతలకు ఎలాంటి సంకేతాలు పంపదలచుకున్నారని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

భవిష్యత్ లీడర్ గా ఎదగాలని అనుకునే వ్యక్తి అసలు ఎమ్మెల్సీ మార్గాన్ని ఎంచుకోవటమే పెద్ద పొరపాటని..పైగా ఎన్నికల వేడి మొదలయ్యాక కూడా ఇంకా ఎమ్మెల్సీ పదవి పట్టుకుని వేలాడటం..అదే పార్టీలో కొంత మంది మాత్రం రాజీనామాలు చేయటం సరైన సంకేతాలు పంపటంలేదని ఓ మంత్రి వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ‘లోకేష్’ గెలిచేందుకు అవసరమైన ‘సేఫ్’ నియోజకవర్గాన్ని ఎంచుకునే పనిలో ఉన్నారని..ముందే నియోజకవర్గాన్ని ప్రకటిస్తే ప్రత్యర్ధులు మరింత ఫోకస్ పెట్టే అవకాశం ఉందనే పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారని కొంత మంది నాయకులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి లోకేష్ ‘ఎన్నికల ఎంట్రీ’ ఎలా ఉంటుందో?. అయితే కొంత మంది పోటీ చేసే నేతలు ఎమ్మెల్సీ పదవులు వదిలేసి..లోకేష్ మాత్రం ఆ పదవిని అట్టిపెట్టుకోవటంపై విమర్శలు విన్పిస్తున్నాయి.

Next Story
Share it