Telugu Gateway
Politics

ప్రత్యేక విమానాలేవీ?.కెసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ టూర్లేవీ!

ప్రత్యేక విమానాలేవీ?.కెసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ టూర్లేవీ!
X

‘మా భేటీపై కొంత మంది ఏవో చిల్లరమల్లర మాటలు మాట్లాడారు. పత్రికల్లో రాశారు. మేం చేశామో తెలుసా?. ఎవరికీ తెలియదు. ఇద్దరం (కెసీఆర్, అసదుద్దీన్) ‘ప్రత్యేక విమానాలు బుక్ చేసుకున్నాం. ఫెడరల్ ఫ్రంట్ తరపున దేశమంతటా తిరుగుతాం. బిజెపి, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేస్తాం’. ఇదీ రెండు నెలల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ చెప్పిన మాటలు. కానీ ఇప్పటి వరకూ ఆ ప్రత్యేక విమానాలు రాలేదు...కెసీఆర్, అసదుద్దీన్ లు కలసి ఫెడరల్ ఫ్రంట్ తరపున ఇప్పటివరకూ ఒక్కటంటే ఒక్క మీటింగ్ పెట్టలేదు. మీటింగ్ పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఎక్కడా జాడ కూడా లేదు. ఈ నెలాఖరులోపు లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ రాబోతోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎవరి రాష్ట్రంలో వారు బిజీ అయిపోతారు. కెసీఆర్ తెలంగాణలోని 17 సీట్లలో అత్యధిక సీట్లు దక్కించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మరి కెసీఆర్ జాతీయ ఏజెండా ఏమైనట్లు?. ఫెడరల్ ఫ్రంట్ కు బ్రేకులు పడ్డాయా?. ఫెడరల్ ఫ్రంట్ చర్చల్లో భాగంగా కెసీఆర్ పలుమార్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశం అయ్యారు.

ఇద్దరం కలసి పనిచేస్తామని..రాష్ట్రాలకు ఎక్కువ హక్కులు ఉండేలా చూస్తామని తెలిపారు. కానీ మమతా బెనర్జీ చేసింది తప్పా..ఒప్పా అన్నది కాసేపు పక్కన పెడితే ఫెడరల్ ఫ్రంట్ లో ఆమెను కలుపుకోవాలని ప్రయత్నించిన కెసీఆర్ మాట మాత్రంగా అయినా ఆమెతో మాట్లాడకపోవటం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి రెండు నెలలు అయినా మంత్రివర్గ విస్తరణ చేయని కెసీఆర్..అటు ఫెడరల్ ఫ్రంట్ పై దృష్టి సారించారా? అంటే అదీలేదని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇఫ్పటికే జాతీయ స్థాయిలో ఎవరెవరు ఎటువైపు ఉండాలో నిర్ణయం అయిపోతూనే ఉంది. ఇంకా నెల రోజుల్లో పార్టీలన్నీ ఎన్నికల కార్యక్షేత్రంలోకి పూర్తి స్థాయిలో దూకాల్సిందే. మరి కెసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ సమావేశాలు..దేశ వ్యాప్తంగా ప్రజలను ఏకం చేసే చర్యలు ఎందుకు ఆకస్మాత్తుగా ఆగిపోయాయి?. దీని వెనక ఉన్న మతలబు ఏమిటి? అన్నది కొద్ది రోజులు పోతే కానీ తెలియదమో.

Next Story
Share it