Telugu Gateway
Politics

టీడీపీ నుంచి వలసలు పంపుతున్న సంకేతం ఏంటి?

టీడీపీ నుంచి వలసలు పంపుతున్న సంకేతం ఏంటి?
X

వచ్చే ఎన్నికల్లో అధికార టీడీపీ గెలుపు కష్టమా?. లేకపోతే ఎందుకు అన్ని వనరులు..అధికార యంత్రాంగం చేతిలో ఉన్న పార్టీని కాదనుకుని ప్రతిపక్షం వైపు ప్రజా ప్రతినిధులు వెళ్ళిపోతున్నారు? ఈ వలసలు పంపుతున్న సంకేతాలు ఏంటి?. రాబోయే ఎన్నికల్లో ఏపీలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?. అటు ప్రధాని మోడీ సహకరించకపోయినా..ఇటు ప్రతిపక్ష నేత జగన్ అడ్డుకున్నా రాష్ట్రాన్ని ఆగ్రగామిగా నిలిపానని చెప్పుకునే చంద్రబాబు ఎన్నికల ముందు ఎందుకింత హంగామా చేస్తున్నారు. ఇది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్. ఎవరైనా ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలోకి పోవాలని చూస్తారు. అక్కడ ఉండే అన్ని రకాల వనరులను ఉపయోగించుకుని మరోసారి గెలవాలని ప్రయత్నం చేస్తారు.

కానీ ఎన్నికలకు మూడు నెలల ముందు ఆకస్మాత్తుగా అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వలసలు పెరగటం దేనికి సంకేతం?. ఏపీలో గతంలో ఎన్నడూలేని రీతిలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందనేది అన్ని వర్గాల నుంచి విన్పిస్తున్న ప్రధాన ఆరోపణ. దీనికి తోడు..ఏపీకి అత్యవసరం అయిన నూతన రాజధాని నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఘోర వైఫల్యం. చంద్రబాబు గెలుపుపై నమ్మకం లేక రాష్ట్రాన్ని దోచిపెట్టినా స్టార్టప్ ఏరియాలో సింగపూర్ కంపెనీలు నిర్మాణాలు చేపట్టకపోవటం. దీనికి తోడు ఎన్నో అంశాలు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయి. టీడీపీ ఎమ్మెల్యేలు మేడా మల్లిఖార్జునరెడ్డి, ఆమంచి కృష్ణమోహన్ లు టీడీపీని వీడి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. వీళ్ళతోపాటు ఎంపీ అవంతి శ్రీనివాస్ కూడా టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ కండువా కప్పుకున్నారు.

సోమవారం నాడు మరో ఎంపీ రవీంద్రబాబు కూడా టీడీపీకి గుడ్ బె చెబుతూ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న సీనియర్ నేత దాసరి జై రమేష్ కూడా వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. రాబోయే రోజుల్లో మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా టీడీపీని వీడి వైసీపీ బాట పట్టే అవకాశం ఉందని టీడీపీ వర్గాల్లోనే బలంగా ప్రచారం జరుగుతోంది. ఓ వైపు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసంతృప్తులను బుజ్జగించేందుకు ఎమ్మెల్సీ పదవులు ఆఫర్ చేస్తున్నా చాలా మంది పార్టీని వీడేందుకే మొగ్గుచూపటంతో టీడీపీ శ్రేణుల్లోనూ అనుమానాలు పెరుగుతున్నాయి.

Next Story
Share it