Telugu Gateway
Politics

టీడీపీలో ‘సర్జికల్ స్ట్రైక్స్ ’ కలకలం!

టీడీపీలో ‘సర్జికల్ స్ట్రైక్స్ ’ కలకలం!
X

ఎక్కడో పీవోకెలో జరిగిన ‘సర్జికల్ స్ట్రైక్స్’ ఏపీలోని అధికార తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతున్నాయి. వీటికి..టీడీపీకి సంబంధం ఏంటి అంటారా?. అక్కడే ఉంది అసలు రాజకీయం. ఈ సర్జికల్ స్ట్రైక్స్ 2 తర్వాత అనంతర పరిణామాలు రాజకీయంగా ఎటువైపు మళ్లుతాయా అన్న టెన్షన్ టీడీపీలో నెలకొంది. భావోద్వేగాలను వాడుకోవటంలో ప్రధాని నరేంద్ర మోడీ దిట్ట. ఇప్పుడున్న పరిస్థితుల్లో సర్జికల్ స్ట్రైక్స్ కారణంగా ఏపీలో బిజెపికి ఏదో పెద్ద సీట్లు..ఓట్లు వస్తాయని ఎవరూ నమ్మరు. కానీ ఈ ప్రభావం ఖచ్చితంగా ఉత్తర భారత దేశంతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాలపై ప్రభావం చూపించటం ఖాయం. అంటే ఈ లెక్కన మళ్లీ నరేంద్రమోడీ ప్రధాని అయ్యేందుకు మార్గం సుగమం అవుతున్నట్లే లెక్క. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ఈ దాడులను బిజెపి రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకోవటం ఖాయం. అంతే కాదు..రాబోయే రోజుల్లో ఈ తరహా దాడులు మరిన్ని చేయటంతోపాటు..మోడీ పక్కా రాజకీయ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నట్లు బిజెపి వర్గాలు చెబుతున్నాయి.

అదే సమయంలో అవసరం అయితే ఎన్నికలను ఓ నెల పాటు వాయిదా వేసే అవకాశం కూడా ఉందని బిజెపి నేతలు అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో బిజెపితో కలసి ఉన్నప్పుడు కార్గిల్ యుద్ధం సెంటిమెంట్ టీడీపీకి కూడా బాగా కలసి వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు మోడీతో విభేదించి బిజెపితో సంబంధాలు తెంచుకున్నారు. ఏపీలో ఈ ప్రభావం పెద్దగా ఉండకపోయినా మళ్ళీ కేంద్రంలో మోడీ అధికారంలోకి వస్తే చంద్రబాబుకు కష్టకాలమే అని చెబుతున్నారు. ఏ రకంగా చూసుకున్నా తాజా పరిణామాలు టీడీపీ నేతల్లో సెగలు పుట్టిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో బిజెపికి గత ఎన్నికల తరహాలో సంపూర్ణ మెజారిటీ వచ్చే అవకాశం లేదని సర్వేలు చెబుతున్నాయి. అయినా సరే అతి పెద్ద పార్టీగా బిజెపి అవతరించనుంది. తాజా పరిణామాలతో మ్యాజిక్ మార్క్ ను చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది టీడీపీ..ముఖ్యంగా చంద్రబాబుకు ‘టెన్షన్’ కలిగించే పరిణామమే.

Next Story
Share it