Telugu Gateway
Politics

ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా హోదా ఇస్తాం

ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా హోదా ఇస్తాం
X

వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారనే అంశంతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ‘ప్రత్యేక హోదా’ ఇఛ్చితీరుతీతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని..తప్పకుండా తాము హామీని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి మిత్రఫక్షంగా ఉంటూ ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు అత్యంత కీలకంగా మారాయి. ప్రధాని హామీ ఇఛ్చారంటే ఆ హామీ దేశం ఇచ్చినట్లే కానీ..ఓ వ్యక్తి హామీగా చూడకూడదని అన్నారు. తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘ప్రత్యేక హోదా భరోసా’ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఇదే తిరుపతిలో మోడీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఏపీకి పదేళ్ల పాటు హోదా ఇస్తామని హామీ ఇచ్చి..మాట తప్పారని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రజలు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..తాము ఖచ్చితంగా అమలు చేసి తీరతామని అన్నారు. తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవటం ఓ గొప్ప వరంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్రమోడీ చెప్పే ప్రతి మాటా ఆబద్ధమే అని ధ్వజమెత్తారు. తాను ప్రజలకు కాపలాదారుగా ఉంటానని ప్రకటించిన మోడీ...దొంగగా మారిపోయారని విమర్శించారు. రాఫెల్ డీల్ లో అనిల్ అంబానీ కంపెనీకి 30 వేల కోట్ల రూపాయలు దోచిపెట్టారని చెప్పారు. దేశంలోని నిరుద్యోగ యువతకు కోట్లాది ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇఛ్చి విఫలమయ్యారని అన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతుల రుణాలు మాపీ చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. మోడీ సర్కారు మూడున్నర లక్ష కోట్ల రూపాయల పారిశ్రామికవేత్తల..బడాబాబుల రుణాలు మాఫీ చేశారని అన్నారు. కానీ రైతుల గురించి మాత్రం పట్టించుకోరని అన్నారు. తాజాగా ముగిసిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో రైతుల రుణాల మాఫీ చేస్తామని హామీ ఇచ్చామని..ఇచ్చిన ప్రకారం రైతు రుణాల మాఫీ చేశామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఒక సారి హామీ ఇచ్చింది అంటే..అది ఖచ్చితంగా అమలు చేసి తీరుతుందని అన్నారు.

ప్రస్తుతం దేశంలో కొంత మంది తాము మాత్రమే దేశ ప్రేమికులుగా చెప్పుకుంటున్నారని బిజెపి సర్కారుపై విమర్శలు గుప్పించారు. జాతీయవాదిగా చెప్పుకునే ప్రధాని మోడీ పుల్వామా సంఘటన తర్వాత ఓ పార్క్ లో తన కోసం తయారు చేస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొన్నారని రాహుల్ ధ్వజమెత్తారు. పుల్వామా ఘటన తర్వాత కూడా మోడీ మూడున్నర గంటల పాటు కెమెరాల ముందు ఫోజులిస్తూ కూర్చున్నారని మండిపడ్డారు రాహుల్. కానీ ఉగ్రవాద దాడిలో మరణించిన వారి కుటుంబాల బాధను మాత్రం పట్టించుకోలేదన్నారు. ఈ అంశాలు అన్నీ ఫోటోలు..వీడియోలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మరో కీలక విషయం ఏమిటంటే ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీపై రాహుల్ గాంధీ ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం విశేషం.

Next Story
Share it