జయరాం కేసులో కీలక మలుపు
ఎక్స్ ప్రెస్ టీవీ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికేవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. తొలుత ఈ హత్యలో ఆయన మేనకొడలు శిఖా చౌదరి పాత్ర ఉందని బలంగా ప్రచారం జరిగింది. అసలు విషయానికి వచ్చేసరికి ఏపీ పోలీసులు హత్య చేసింది రాకేష్ రెడ్డి అని..ఇందులో శిఖా చౌదరి పాత్రేమీ లేదని తేల్చేశారు. దీంతో పలుఅనుమానాలు వ్యక్తం అయ్యాయి. అంతే కాదు..ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని..ఈ కేసును తెలంగాణ పోలీసులకు అప్పగించాలని జయరాం భార్య కోరారు. ఇది ఏపీ పోలీసుల ప్రతిష్టకు కూడా మచ్చగా మారింది. ఈ తరుణంలో ఏపీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసును తెలంగాణకు బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జయరామ్ హత్య కేసులో మేనకోడలు శిఖా చౌదరి పాత్రపై మృతుని భార్య పద్మశ్రీ అనుమానం వ్యక్త చేశారు.
గత నాలుగు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసులు తన భర్త హత్యపై రకరకాల ప్రచారాలు చేస్తూ, టీవీ సీరియల్స్‌లా సాగదీసి ఏమాత్రం తేల్చలేకపోయారని, ఈ నేపథ్యంలో ఆంధ్రా పోలీసులపై నమ్మకం కోల్పోయానని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఆమె ఫిర్యాదు చేశారు.కేసు వ్యవహారాలన్నీ తెలంగాణతో ముడిపడి ఉండడంతోనే జయరామ్ కేసును బదిలీ చేసినట్టు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. పద్మశ్రీ ఆరోపణల నేపథ్యంలో కేసును బదిలీ చేయకుండా మరింత వివాదాలకు తావు ఇవ్వకూడదని ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. జయరామ్ హత్య కేసులో శిఖాకు ఎలాంటి సంబంధం లేదని ఏపీ పోలీసులు చెప్పడంతో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మేనకోడలు శిఖా, సొంత అక్కనుంచి ప్రాణహాని ఉందంటూ జయరామ్ గతంలో తనతో చెప్పినట్టు పద్మశ్రీ మీడియాకు తెలిపారు. తాజా పరిణామాలతో ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.