Telugu Gateway
Politics

మోడీ మరో సర్జికల్ స్ట్రైక్..పీవోకేలో బాంబుల వర్షం

మోడీ మరో సర్జికల్ స్ట్రైక్..పీవోకేలో బాంబుల వర్షం
X

ఊహించిందే జరిగింది. పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఎలాంటి చడీచప్పుడు లేకుండా మంగళవారం తెల్లవారు జామున పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోని జైషే మహ్మద్ ఉగ్రవాద క్యాంపులపై బాంబుల వర్షం కురిసింది. ఏకంగా వెయ్యి కిలోల బాంబులను వైమానిక దాడుల ద్వారా ఉగ్రవాద క్యాంప్ లపై వేశారు. కార్గిల్ యుద్ధం తర్వాత వైమానిక దాడులు జరగటం ఇదే మొదటి సారి. పూర్తిగా ఉగ్రవాద క్యాంపులనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు పూర్తి చేశారు. యుద్ధ విమానాలతో మెరుపు దాడులు చేసి ‘టార్గెట్’ పూర్తి చేసేశారు. ఈ వైమానిక దాడుల్లో భారీ ఎత్తున ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. అయితే ఈ సంఖ్య ఎంత అన్న దానిపై ఇంకా సమాచారం బహిర్గతం కావాల్సి ఉంది.

పుల్వామా ఘటనకు కారణమైన వారిని వదిలిపెట్టేది లేదని ప్రధాని మోడీ గత కొంత కాలంగా ప్రకటిస్తూ వస్తున్నారు. అన్నట్లుగానే పీవోకెలోని ఉగ్రవాద క్యాంపులను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పాక్ కూడా స్పందించింది. భారత్ కు చెందిన విమానాలను తమ ఫైటర్ జెట్స్ తరిమికొట్టాయని ఓ వైపు..మరో వైపు భారత్ ఎల్ వో సీని అతిక్రమించిందని పాక్ ఆరోపిస్తోంది. ఎప్పటిలాగానే పాక్ ఈ దాడులను చాలా తేలిక చేసి మాట్లాడుతోంది. అయితే ప్రాధమిక సమాచారం ప్రకారం ఈ దాడుల్లో ఏకంగా 300 మందికిపై ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం అందుతోంది. భారత్ కు చెందిన 12 మిరేజ్ విమానాలు పీవోకెలోకి ప్రవేశించి తమ పని పూర్తి చేశాయి. ఈ దాడులపై పాక్ స్పందన ఎలా ఉంటుంది. దీనిపై అంతర్జాతీయ సమాజం ఎలా స్పందిస్తాయో వేచిచూడాల్సిందే. ఎన్నికలకు ముందు జరిగిన ఈ సర్జికల్ స్ట్రైక్ రాజకీయంగా కూడా ప్రకంపనలు సృష్టించటం ఖాయంగా కన్పిస్తోంది.

Next Story
Share it