Telugu Gateway
Andhra Pradesh

తిరుపతిలో రెండు కోట్ల డూప్లెక్స్ కొట్టేసిన మంత్రి అల్లుడు

తిరుపతిలో రెండు కోట్ల డూప్లెక్స్ కొట్టేసిన మంత్రి అల్లుడు
X

ఆయన కీలక శాఖలో ఉన్నతాధికారి. ఓ సీనియర్ మంత్రికి అల్లుడు. అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఆయనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ‘నిప్పు’ను ఆదర్శంగా భావించే నారా చంద్రబాబునాయుడి సర్కారు ఆయన జోలికి మాత్రం పోదు. ఎందుకంటే ఆయన తమకు కావాల్సిన మంత్రి అల్లుడు కదా?. ఏమైనా అంటే ఆ సీనియర్ మంత్రి సింగపూర్ కుంభకోణాల జాతకాలు మొదలుకుని తన భాగోతాలు ఎక్కడ బయటపెడతారో అని ‘ముఖ్య’ నేతకు టెన్షన్. అందుకే కామ్ గా ఎవరికి అందింది వారు దోచుకుందాం..దాచుకుందాం అనే కాన్సెప్ట్ ను బాగా వంటపట్టించుకున్నారు. అందుకే మీ దోపిడీని మేం అడగం..మా దోపిడీని మీరు పట్టించుకోవద్దు అనే ఫార్ములాకి వచ్చినట్లు కన్పిస్తోంది. విషయం ఏమిటంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి చెందిన 140 కోట్ల రూపాయలను ఏపీ వైద్య శాఖ తీసేసుకుంది. ఆ నిధులతో రాష్ట్రంలోని పలు ఆస్పత్రులను ఎన్ఏబిహెచ్ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. కానీ ఒక్కటంటే ఒక్క ఆస్పత్రికి కూడా ఎన్ఏబిహెచ్ గుర్తింపు వచ్చే అవకాశం లేదని ఆ శాఖ వర్గాలు తెలిపాయి.

ఎందుకంటే ఈ భవనాలకు అసలు పర్మిషన్లు లేకపోవటం ఒకెత్తు అయితే..చాలా వాటికి ఫైర్ సేఫ్టీ నిబంధనలకు అనుగుణంగా కూడా లేవు. డబ్బులు తీసుకున్నారు..కమిషన్లు దండుకున్నారు వాళ్ల పని అయిపోయింది. ఇక అంతే. ఇదంతా ఒకెత్తు అయితే రాష్ట్ర వ్యాప్తంగా పనులు పూర్తి అయినా కూడా విజయవాడలో ఎనిమిది కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఆస్పత్రి పనుల్లో రెండు కోట్ల రూపాయల మేర కూడా పనులు పూర్తి కాలేదు. సదరు కాంట్రాక్టర్ పై అధికారులెవరైనా ఆగ్రహం వ్యక్తం చేస్తే సదరు మంత్రి అల్లుడు వెంటనే రంగంలోకి దిగుతారు. ఈ కాంట్రాక్టర్ నుంచే తిరుపతిలో సదరు మంత్రి అల్లుడు రెండు కోట్ల విలువైన డూప్లెక్స్ ను రాయించుకున్నారు. అందుకు బహుమానంగానే ఈ పని ఇఛ్చేశారు. ఎనిమిది కోట్ల పనికి రెండు కోట్ల డూప్లెక్స్ ఇస్తారా? అన్నదే కదా మీ సందేహం. అవును..భవిష్యత్ లో కూడా నీ సంగతి నేను చూసుకుంటా అనే బ్లాంకెట్ హామీ కూడా ఉందిలేండి?. మనకు మేలు చేసిన వాడికి మనం మేలు చేసిపెట్టాలి కదా?

అందుకే వెంటనే తన వంతు సహరారం ఇచ్చేందుకు రెడీ అయిపోయారు. విజయవాడలో నిర్మిస్తున్న ఆస్పత్రి నిర్మాణ సమయంలో పెట్టాల్సిన ఖరీదైన బ్రాండెడ్ పరికరాల బదులు నాసిరకం పరికరాలు పెట్టినా పర్లేదు అంటూ ఏకంగా కాంట్రాక్టర్ తో సప్లిమెంట్ ఆగ్రిమెంట్ చేయటానికి కూడా రెడీ అయిపోయారు. వైద్య ఆరోగ్య శాఖాపరంగా జాప్యం ఉన్న ఎవరికీ గడువు పెంచటానికి ససేమిరా అనే ఈ అధికారి తన అస్మదీయ కాంట్రాక్టర్ కు మాత్రం ఎక్స్ టెన్షన్ ఆఫ్ టైమ్(ఈవోటీ)లు మాత్రం ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చేస్తున్నారు. అంతే కాదు ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం నుంచి తీసుకున్న నిధులను నేరుగా సదరు మంత్రి అల్లుడు నిర్వహించే శాఖ ఖాతాలో వేసి..కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు. అందులోనూ ఆయన ‘చేతివాటం’ చూపినట్లు విమర్శలు విన్పిస్తున్నాయి. అడ్డగోలుగా సంపాదించిన అవినీతి సొమ్ముతో సదరు మంత్రి అల్లుడు విజయవాడ కేంద్రంగా రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నా ప్రభుత్వం మాత్రం చూస్తూ ఊరుకుంటోంది.

Next Story
Share it