Telugu Gateway
Andhra Pradesh

కెవీపీలో ‘చంద్రబాబు’ టెన్షన్!

కెవీపీలో ‘చంద్రబాబు’ టెన్షన్!
X

కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కె వి పి రామచంద్రరావు ‘టెన్షన్ ’లో ఉన్నారా?. అదీ ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని చూసి ఆయన భయపడుతున్నారా?. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చంద్రబాబు బాగా దగ్గర కావటంతో కాంగ్రెస్ నుంచి తనను బయటకు పంపిస్తారనే భయం కెవీపీలో కన్పిస్తుందా? బుధవారం ఢిల్లీ వేదికగా కెవీపీ మీడియాతో మాట్లాడిన తీరు చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం కలుగుతుంది. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నది దివంగత వైఎస్ కల అని ..ఆ కల నెరవేరేందుకు ఎవరెన్ని కుట్రలు చేసినా తాను పార్టీని వీడనని ప్రకటించారు. అంటే ఇప్పుడు దివంగత వైఎస్, టీడీపీ చంద్రబాబునాయుడి కల ఒకటే అన్న మాట. అంతే కాదు..ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ మూడున్నర సంవత్సరాల క్రితమే ఉద్యమం ప్రారంభించిందని కెవీపీ తెలిపారు. కానీ చేసిన ఉద్యమాన్ని కూడా చెప్పుకోలేని రాహుల్ గాంధీ చివరి నిమిషంలో మాట మార్చిన ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి బహిరంగంగా మద్దతు ఇస్తుండటంతో మౌనం దాల్చటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది కెవీపీ పరిస్థితి.

ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కెవీపీ చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...‘ ఎన్ని ప్రలోభాలు, ఇబ్బందులు ఎదురైనా చిన్నతనం నుంచి ఇప్పటివరకూ కాంగ్రెస్‌లో కొనసాగుతున్నాను. రాహుల్‌ గాంధీ ప్రధాని అయ్యేవరకూ క్రియాశీలక రాజకీయాల్లో ఉంటా. కాంగ్రెస్ పార్టీలోనే నా శేష జీవితం. మూడేళ్ల క్రితమే మేము రాష్ట్రపతిని కలిసి ప్రత్యేక హోదా కోరాం. మూడేళ్ల క్రితం కోటి సంతకాలు సేకరించాం. హోదాపై చంద్రబాబు ఇప్పుడు కళ్లు తెరిచారు. ఆయనది ఓవరాక్షన్. నరేంద్ర మోదీ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబుకు ఇప్పుడు జ్ఞానోదయం అయింది. హోదాపై నా ప్రైవేట్ మెంబర్ బిల్లుకు 14 పార్టీలు మద్దతు పలికాయి. ఆ బిల్లుకు మద్దతిచ్చే పార్టీలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చేరింది. పచ్చి అబద్ధాలను నిజాయితీగా చెప్పడంలో చంద్రబాబు రికార్డు సృష్టించారు. రాష్ట్ర కాంగ్రెస్‌కు అధిష్టానం పూర్తి భరోసా ఇస్తుంది. కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు సృష్టించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావు.

పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మద్ధతుతోనే అన్ని కార్యక్రమాలు చేశాం. మా మధ్య ఎలాంటి అపార్థాలు లేవు’ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సృష్టించడంలో చంద్రబాబు దిట్ట. నాకు నా పార్టీకి మధ్య అగాధం సృష్టించొద్దు. నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం బద్ధుడినై ఉన్నా. ఆ విషయం పార్టీకి పూర్తిగా తెలుసు. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో అనేక సంవత్సరాలుగా పార్లమెంట్‌లో ఉద్యమిస్తున్నా. ఏపీ ప్రయోజనాల కోసం రాజ్యసభ సభ్యత్వాన్ని సైతం ఫణంగా పెట్టా. సభలో గంటల తరబడి నిలబడి అస్వస్థతకు గురయ్యా. పెయిన్ కిల్లర్స్ స్ప్రే చేసుకొని సభలో నిలబడి ఒంటరి పోరాటం చేస్తున్నానని రాజ్యసభ చైర్మన్ సైతం అన్నారు.’ అని మీడియా ముందు వాపోయారు కెవీపీ. ఎందుకు ఆయన అంత దీనంగా మాట్లాడారు అన్నదే ప్రస్తుతానికి సస్పెన్స్.

Next Story
Share it