జవాన్ల కుటుంబాలకు కెటీఆర్ సాయం 25 లక్షలు
ఉగ్రవాదుల దాడిలో వీర మరణం పొందిన జవాన్ల కుటుంబాలపై దేశ వ్యాప్తంగా సానుభూతి వెల్లువెత్తుతోంది. అదే సమయంలో భారత్ ఈ దాడికి పాల్పడిన వారిపై వెంటనే ప్రతీకారం తీర్చుకోవాలనే అభిప్రాయం కూడా బలంగా విన్పిస్తోంది. ఇదిలా ఉంటే దేశంలోని వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు..పౌరులు ఉగ్రవాదుల దాడిలో మరణించిన కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ తన వంతుగా 25 లక్షల రూపాయల సాయం ప్రకటించారు.
జవాన్ల మరణం తనను ఎంతో కలచివేసిందని, ప్రజలను కాపాడే కర్తవ్యంలో మరణించిన వారికి తమ రాష్ట్ర ముఖ్యమంత్రి తరఫున నివాళి అర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. దాడిలో మరణించిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానూభూతికి వ్యక్తం చేస్తూ.. తన వ్యక్తిగతంగా రూ.25 లక్షల విరాళం ఇస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. తన స్నేహితులు మరో 25 లక్షలు ఇస్తారని, మొత్తం 50 లక్షల రూపాయలను సీఆర్‌పీఎఫ్ అమర జవాన్లకు అందిస్తున్నట్లు వెల్లడించారు. సరిహద్దులో గస్తీ కాస్తున్న జవాన్ల కారణంగానే మనం క్షేమంగా ఉన్నామని కేటీఆర్ వ్యాఖ్యానించారు.