చంద్రబాబుకు షాక్..వైసీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ మామ

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఇది ఊహించని షాక్. జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు గురువారం నాడు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఒకప్పుడు చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ తో కలసి నార్నే శ్రీనివాసరావు కొద్ది కాలం పాటు ఓ ఛానల్ ను కూడా నడిపిన విషయం తెలిసిందే. తర్వాత నిర్వహణలో వైఫల్యాలు..రకరకాల కారణాలతో ఛానల్ నుంచి లోకేష్ పక్కకు తప్పుకున్నారు. ఎన్టీఆర్ పెళ్లి విషయంలో కూడా అప్పుడు చంద్రబాబునాయుడే పెళ్లి పెద్ద గా ఉండి ఈ సంబంధాన్ని ఖరారు చేశారు. చంద్రబాబుకు అంత దగ్గర అయిన నార్నే శ్రీనివాసరావు వైసీపీలో చేరటం టీడీపీలో కలకలం రేపుతోంది. రాజకీయంగా ఆయన ఏమీ పెద్ద నేత కాకపోయినా..జూనియర్ ఎన్టీఆర్ మామ కావటంతోనే ఈ అంశానికి ప్రాధాన్యత వస్తోంది.
అయితే తాను వైసీపీలో చేరటానికి ..జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం లేదని నార్నే శ్రీనివాసరావు ప్రకటించారు. వైసీపీలో చేరిన తర్వాత నార్నే మీడియాతో మాట్లాడుతూ ‘ ఏపీలో చంద్రబాబు పాలన సరిగా లేదు. వైఎస్ జగన్‌ను ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలనే పార్టీలో చేరాను. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబంతో నాకు పదేళ్ల నుంచి అనుబంధం ఉంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు. అయితే పార్టీ గెలుపునకు మాత్రం నావంతు కృషి చేస్తాను. వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడటమే లక్ష్యం.’ అని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ఇది చంద్రబాబుకు రాజకీయంగా ఇబ్బందికర పరిణామంగా మారటం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.