చంద్రబాబు కొత్త మాయలు మొదలయ్యాయి
ఎన్నికల సీజన్ రావటంతో ఏపీ ముఖ్యమంత్రిచంద్రబాబునాయుడి కొత్త మాయలు మొదలయ్యాయని..ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మనం చంద్రబాబు ఒక్కడితోనే కాదు..ఎల్లో మీడియాతో కూడా పోరాడాల్సి ఉంటుందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నాలుగేళ్ళుగా అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకుని కొత్త మాయలు చేయటానికి రెడీ అయ్యారని జగన్ ఆరోపించారు. చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో బుధవారం ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ సమర శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ... రానున్న రెండు నెలలు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చంద్రబాబు ప్రలోభాలకు లోను కాకుండా చూడాలని, ప్రతి ఓటర్ ఓటు వేసేలా బూత్ కమిటీలు బాధ్యత తీసుకోవాలని వైఎస్ జగన్ కోరారు. ఉన్నది లేనట్లుగా... లేనిది ఉన్నట్లుగా ఎల్లో మీడియా చూపిస్తోందన్నారు. చంద్రబాబు ‘ఎన్నికలకు ఆరు నెలల ముందు.. మూడు నెలల కోసం’ మరో సినిమా చూపిస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు.
గత ఎన్నికల్లో గెలిచాక మొదలైన బాబు కొత్త సినిమా కథ ‘రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలనేది’ ప్రతి కాంట్రాక్ట్‌లోనూ కమీషన్లే. ఇసుక, మట్టి, భూములు సహా దేన్నీ వదిలి పెట్టలేదు. ఈ అయిదేళ్లలో చంద్రబాబు రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్నారు. పై స్థాయిలో చంద్రబాబు, కిందస్థాయిలో జన్మభూమి కమిటీలు దోచుకున్నాయి. నాలుగేళ్లు పాటు బీజేపీ, పవన్ కల్యాణ్తో కలిసి రాష్ట్రాన్ని ముంచేశారు. ఇప్పుడు యూటర్న్ తీసుకుని డ్రామాలాడుతున్నారు. తాజాగా ప్రధాని మోదీతో పోరాటం చేస్తున్నట్లు నాటకాలాడుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ కట్టకుండానే జాతికి అంకితం చేయడం చంద్రబాబు సినిమాలో చూశాం. ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబే. హోదా కోసం పోరాటం చేస్తున్నవారిపై కేసులు పెట్టడమే కాకుండా, జైలుకు పంపుతామని బెదిరించారు. ఇప్పుడు హోదా కోసం పోరాటం అంటూ చంద్రబాబు నల్ల చొక్కాలు వేసుకుంటున్నారు. హోదా కోసం పోరాటం అంటూ ఘరానా మోసం చేస్తున్నారు.