Telugu Gateway
Politics

దేశం ‘సురక్షితం’ ఇప్పుడు

దేశం ‘సురక్షితం’ ఇప్పుడు
X

‘దేశానికి ఎప్పటికీ తలవంపులు తీసుకురాను. ఈ దేశం సురక్షితమైన చేతుల్లో ఉందన్న విశ్వాసాన్ని కల్పిస్తున్నా. భారతావని సగర్వంగా తలఎత్తుకునే ఉంటుంది. దేశ గౌరవ ప్రతిష్టలను దెబ్బతీసే పనులు ఎప్పటికీ చేయను’ అంటూ ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. వాస్తవాధీన రేఖ వెంబడి పాక్‌ ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు చేపట్టిన నేపథ్యంలో ప్రధాని మోదీ మంగళవారం రాజస్ధాన్‌లోని చురులో ప్రచార ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. ఉగ్ర దాడులు జరిగినా అవి మన దేశ పురోగతిని, పయనాన్ని ఆపలేవని స్పష్టం చేశారు. రాజస్తాన్‌, చురులో ఇప్పటివరకూ రైతులకు ఒక్క రూపాయి సొమ్ము కూడా ముట్టకపోవడం దురదృష్టకరమని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ లబ్ధిదారులైన రైతుల పేర్లను పంపలేదని, వారు కేంద్రంతో సహకరించడం లేదని రాజస్ధాన్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రానున్న పదేళ్లలో రైతుల ఖాతాల్లో రూ 7.5 లక్షల కోట్లు జమచేస్తామని చెప్పుకొచ్చారు. రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు వేస్తామని వెల్లడించారు. తమ ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందని, రైతులకు కేంద్రం సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోరాదని కోరారు. భారత్‌లో దృఢమైన సర్కార్‌ అవసరమని, భారత్‌ను నూతన శిఖరాలకు తీసుకువెళ్లేందుకు మరోసారి తమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Next Story
Share it