Telugu Gateway
Politics

అదే స్పూర్తితో ఏపీ ప్రజలు చంద్రబాబుపై తిరగబడితే!

అదే స్పూర్తితో ఏపీ ప్రజలు చంద్రబాబుపై తిరగబడితే!
X

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇఛ్చిన ప్రధాని నరేంద్రమోడీ ఆ హామీని అమలు చేయలేదు. ఇచ్చిన మాట నిలుపుకోలేదు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే ప్రధాని మోడీ విశాఖపట్నం పర్యటనను అడ్డుకోవాలని..నిరసన తెలపాలని సాక్ష్యాత్తూ తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు. మరి ఇదే పని ఏపీ ప్రజలు చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పరిస్థితి ఏంటి?. తాము అధికారంలోకి వస్తే రైతులందరి రుణాలు మాఫీ చేస్తామని..తర్వాత ‘కోతలు’ పెట్టిన అంశంపై ఏపీలోని రైతులు చంద్రబాబు నిలదీస్తే?. చేస్తామన్న రుణమాఫీని కూడా ఇంకా పూర్తిగా అమలు చేయనందుకు రైతులు అడ్డం తిరిగితే?. సింగపూర్ కంపెనీలతో ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని నిర్మిస్తానని చెప్పి...దేశీయ కంపెనీలతో ఎందుకు నిర్మిస్తున్నారని అమరావతి..ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబుపై తిరుగుబాటు చేస్తే?.

ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ యువతకు రెండు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి..చివరి ఏడాదితో తొలుత వెయ్యి అని ప్రకటించి..ఎన్నికలు వస్తున్నాయని ఆ వెంటనే రెండు వేలకు పెంచిన వైనంపై యువత నిగ్గదీస్తే?. నాలుగున్నర సంవత్సరాలు డ్వాక్రా మహిళలను వదిలేసి..ఎన్నికల ముందు పసుపు- కుంకుమ పేరుతో హంగామా చేస్తున్న వైనంపై మహిళలు తిరుగుబాటు చేస్తే?. 2018 డిసెంబర్ నాటికి పోలవరం మొదటి దశను పూర్తి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చి..ఇంకా అరవై శాతం పనులు మాత్రమే ఎందుకు చేశారని ఏపీ ప్రజలు ఎదురుతిరిగితే?. పుష్కరాల నాటికి కనకదుర్గ ఫ్లైఓవర్ ను పూర్తి చేస్తానని హామీ ఇచ్చి..ఇప్పటికీ పూర్తి చేయని వైనం జిల్లా ప్రజలు అడ్డం తిరిగితే?.

రాజధాని కోసం అని రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుని సింగపూర్ కంపెనీలు..కార్పొరేట్ సంస్థలు..ప్రైవేట్ వ్యాపారాలకు దోచిపెడుతున్నారేంటి అని రైతులు నిలదీస్తే?. వైఎస్ హయాంలో జలయజ్ణం పేరుతో దోపిడీ సాగిందని ఆరోపించి..ఇప్పుడు అంతకు మించిన దోపిడీని ఎందుకు సాగిస్తున్నారు అని ప్రజలు ప్రశ్నిస్తే?. రాష్ట్రంలోని గ్రామాలకు రోడ్లు, మంచి నీటి సౌకర్యాలు కల్పించకుండా సింగపూర్ కు విమానాలు నడిపేందుకు ప్రజల సొమ్మును వయబులిటి గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) కింద అప్పనంగా అప్పగించాల్సిన అవసరం ఉందా? అని ఏపీ ప్రజలు తిరగబడితే? ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు తాజా ఐదేళ్ల పాలన విషయంలో ఇచ్చిన హామీలు..చేసిన అక్రమాలు ప్రజలు పరిగణనలోకి తీసుకుంటే ఆయన బయట కూడా అడుగుపెట్టలేరేమో?.

Next Story
Share it