Telugu Gateway
Telangana

ఇక రియల్ బూమ్...తగ్గనున్న ఇంటి ధరలు

ఇక రియల్ బూమ్...తగ్గనున్న ఇంటి ధరలు
X

కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ముందు గృహ కొనుగోలుదారులకు మేలు చేసే నిర్ణయం తీసుకుంది. ఎప్పటి నుంచో విన్పిస్తున్నట్లుగా జీఎస్టీ రేట్లు తగ్గిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. నిర్మాణంలో ఉన్న నివాస సముదాయాల విక్రయంపై విధించే జీఎష్టీని ప్రస్తుత 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. అందుబాటు గృహాల కేటగిరీలో లేని అన్ని గృహాలకూ తగ్గించిన జీఎస్టీ వర్తిస్తుంది. ఇక అందుబాటు గృహాలపై ఇప్పటివరకూ విధిస్తున్న 8 శాతం జీఎస్టీని 1 శాతానికి తగ్గిస్తూ ఆదివారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. అయితే తగ్గించిన రేట్లు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు.

గృహ విక్రయాలపై జీఎస్టీని భారీగా తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పాటు దిగివచ్చిన వడ్డీరేట్లతో సగటు జీవి సొంతింటి కల నెరవేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయంతో దేశీయ నిర్మాణ రంగంలో ఉత్తేజం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత కొంత కాలంగా జీఎస్టీ శ్లాబుల్లో మార్పులు చేస్తూ మండలి పలు నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. ఇఫ్పుడు అత్యంత కీలకమైన రియల్ రంగానికి మేలు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. జీఎస్టీ రేట్లు మరీ అధికంగా ఉండటంతో గృహ కొనుగోలుదారులపై ఇంత వరకూ భారీ ఎత్తున భారం పడేది.

Next Story
Share it