ఎక్స్ ప్రెస్ టీవీ ఛైర్మన్ హత్య!
ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎక్స్ ప్రెస్ టీవీ ఛైర్మన్ చిగురుపాటి జయరాం హత్యకు గురయ్యారు. తొలుత అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు..తలపై గాయాలను పరిశీలించిన తర్వాత హత్య కేసుగా నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో హైవే పెట్రోలింగ్ టీమ్ కారును గుర్తించారు. కారులో వెనక సీటు జయరాం మృతదేహం ఉంది. నందిగామ మండలం ఐతవరం సమీపంలో 65 నెంబర్ జాతీయ రహదారి పక్కన ఈ కారును గుర్తించారు.
జయరాం కోస్టల్ బ్యాంకు డైరక్టర్ గా ఉండటంతోపాటు..ఓ ఫార్మా కంపెనీ ఎండీగా ఉన్నారు. గతంలో ఆయన ఎక్స్ ప్రెస్ టీవీని నడిపారు. గత కొంత కాలంగా ఆ ఛానల్ మూతపడింది. కారులో మద్యం సీసాలు లభ్యమయ్యాయని, జయరాం మృతిని హత్యకేసుగా నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు. జయరాంకు ఆస్తి తగాదాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. మృతుని బ్యాంక్ లావాదేవీలు, కాల్ డేటాపై దృష్టి పెట్టామని పోలీసులు తెలిపారు.చిగురుపాటి జయరాంకు అమెరికా పౌరసత్వం ఉంది. ఆయన భార్య, పిల్లలు అమెరికాలోనే నివాసం ఉంటారు.పోలీసులు వాళ్ళకు ఇప్పటికే సమాచారం అందజేశారు.