చిన్న రైతులకు చంద్రబాబు సాయం రోజుకు 11 రూపాయలు
మోడీ సర్కారు కొత్త బడ్జెట్ లో పీఎం కిసాన్ యోజన స్కీమ్ కింద రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో ఇస్తామని ప్రకటించింది. అంటే నెలకు ఐదు వందల రూపాయలు ఏ మూలకు వస్తాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. కానీ ఇఫ్పుడు ఆయన ఏమి చేశారు?. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కొత్తగా ప్రకటించిన ‘అన్నదాత సుఖీభవ స్కీమ్’ కింద చిన్న రైతులకు రోజుకు సర్కారు తరపున చేసే సాయం 11 రూపాయలు. కానీ అదే పెద్ద రైతులకు మాత్రం రోజుకు 27.39 రూపాయలు. ఎవరైనా చిన్న రైతులకు ఎక్కువ సాయం చేసి..పెద్ద రైతులకు తక్కువ సాయం చేస్తారు. కానీ చంద్రబాబు అందుకు రివర్స్ లో వస్తున్నారు. కేంద్రం ఇచ్చే ఆరు వేలకు ఏపీ సర్కారు తరపున కేవలం నాలుగు వేల రూపాయలు మాత్రమే జత చేస్తున్నారు.
కేంద్రం ఐదు ఎకరాలు ఉన్న రైతులకు ఈ స్కీమ్ వర్తింపచేస్తామని ప్రకటించింది. ఎక్కువ మంది చిన్నకమతాల రైతులు ఈ స్కీమ్ లోకి వచ్చేస్తారు. కానీ చంద్రబాబు మాత్రం ఐదు ఎకరాల పైన పోలం ఉండి కేంద్రం స్కీమ్ లో కవర్ కాని వారికి మాత్రం పది వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. దీనికి పొలం సీలింగ్ ఏమీలేదు. అంటే చిన్న రైతులకు ఏపీ ప్రభుత్వం తరపున తక్కువ సాయం చేసి..పెద్ద రైతులకు మాత్రం ఎక్కువ సాయం చేసేలా నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఏదైనా ఒకటి మంచి నిర్ణయం ఉంది అంటే అది కౌలు రైతులకు కూడా సాయం అందిస్తామని చెప్పటమే. అయితే ఈ కౌలురైతులకు సంబంధించిన గణంకాలు సర్కారు దగ్గర ఎంత పక్కాగా ఉన్నాయి..సాయం కూడా ఎంత పక్కాగా అమలు చేస్తారన్నది వేచిచూడాల్సిందే.