Telugu Gateway
Politics

హవాలా డబ్బు కోసమే జగన్ లండన్ కు

హవాలా డబ్బు కోసమే జగన్ లండన్ కు
X

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంచలన ఆరోపణలు చేశారు. హవాలా డబ్బు తెచ్చుకునేందుకు జగన్ విదేశీ పర్యటనలకు వెళ్ళారని ఆరోపించారు. సహజంగా ఎన్నికల ముందు ఎవరూ విదేశీ పర్యటనలకు వెళ్లరని అన్నారు. వైసీపీ వైఖరి దొంగే దొంగ అని అరుస్తున్న చందంగా ఉందని విమర్శించారు. వాళ్లు చేసే తప్పుడు పనులు ఇతరులకు ఆపాదిస్తున్నారని..తప్పుడు సర్వేలతో ప్రజలను మోసం చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. శనివారం నాడు పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘దొంగ ఓట్లు చేర్చేది వాళ్లే, ఫిర్యాదులు పంపేది వాళ్లే. తప్పుడు మెయిల్స్, దొంగ సర్వేలలో ఆరితేరారు. వైసిపి,బిజెపి కుట్రలపై ప్రజల్లో చర్చ జరగాలి. స్థానికంగా వైసిపి ప్రలోభాలను ఎండగట్టాలి.

టిడిపిపై చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టాలి. నమ్మకానికి మారుపేరు తెలుగుదేశం పార్టీ. ప్రజల్లో విశ్వసనీయతే తెలుగుదేశం పార్టీ బలం. మనపై నమ్మకాన్నిమరింత పెంచుకోవాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలి.’ అన్నారు. అదే సమయంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించారు. గుజరాత్ సీఎంగా మోది అప్పటి ప్రధాని మన్మోహన్ పై ఏం మాట్లాడారు..? నరేంద్ర మోది అప్పటి మాటలనే మళ్లీ గుర్తు చేశాం. దానిపై బిజెపి నేతల రాద్ధాంతం అనవసరం. 2014కంటే ముందు అమిత్ షా ఎక్కడ ఉన్నారు..? టిడిపి చేసింది మోసం కాదు,బిజెపి చేసింది నమ్మకద్రోహం. మోసాలు చేస్తోంది మీరు,కుట్రలు చేస్తోంది మీరు. ఎవరు దేశానికి ద్రోహులో ప్రజలే తేలుస్తారు. ఎవరు రాజకీయాలకు వాడుకుంటున్నారో తేలుస్తారని అన్నారు.

Next Story
Share it