Telugu Gateway
Politics

జీఎంఆర్ తో చంద్రబాబు కుమ్మక్కు

జీఎంఆర్ తో చంద్రబాబు కుమ్మక్కు
X

అప్పుడు ఎల్ 1గా రాని జీఎంఆర్ ఇప్పుడెలా వచ్చింది?

ఏఏఐ టెండర్ రద్దుకూ ఇదే కారణం

క్యాప్టివ్ పోర్టు కూడా ‘స్విస్ ఛాలెంజ్’ స్కామ్ తో జీఎంఆర్ కు అప్పగింత

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ‘బహిరంగ కుమ్మక్కు’కు ఇదో మచ్చుతునక. ఒకే ఎయిర్ పోర్టు ప్రాజెక్టు. ఒక సారి ఎల్ 2 వస్తుంది. మరో సారి ఎల్ 1 వస్తుంది. తనకు కావాల్సిన జీఎంఆర్ కు కాకుండా ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) కు దక్కిన భోగాపురం అంతర్జాతీయ టెండర్ ను చంద్రబాబు సర్కారు రద్దు చేసింది. అధికారులు వద్దన్నా సరే..కేబినెట్ లో పెట్టి మరీ ఈ నిర్ణయం తీసుకుంది. నిజంగా ఏపీ ప్రజలపై చంద్రబాబుకు ఏ మాత్రం ప్రేమ ఉన్నా ప్రైవేట్ సంస్థలతో పోలిస్తే అతి తక్కువ యూజర్ డెవలప్ మెంట్ ఫీజు (యూడీఎఫ్) వసూలు చేసే ఏఏఐకే టెండర్ అప్పగించి ఉండాల్సింది. ఏమైనా డిజైన్లలో మార్పులు, చేర్పులు కావాలని అనుకుంటే ఆ మేరకు అదనపు చెల్లింపులు చేసినా ఎవరూ అభ్యంతరం చెప్పేవారు కాదు. కానీ ఏఏఐ అయితే తమకు రావాల్సిన ముడుపులు వచ్చే అవకాశం లేదనే ఏకైక కారణంతో తొలిసారి పిలిచిన టెండర్ ను ఏకపక్షంగా రద్దు చేశారు. మళ్ళీ టెండర్ పిలిచారు.

ఓ వైపు కేంద్ర పౌర విమానయాన శాఖ భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ప్రారంభం అయినా సరే విశాఖపట్నం విమానాశ్రయంలో కార్యకలాపాలు రద్దు చేయమని చెబుతోంది. ఈ సమయంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏ మాత్రం లాభదాయకం కాదు. మరి అలాంటప్పుడు జీఎంఆర్ తొలుత తక్కువ మొత్తం ఆఫర్ చేసి..ఇప్పుడు అందరి కంటే ఎక్కువ మొత్తం ఆఫర్ ఎలా చేయగలిగింది. ఇంతలో అంత మార్పు ఎలా వచ్చింది?. ప్రాజెక్టు అంచనాల్లోనూ పెద్ద ఎత్తున గోల్ మాల్ జరిగినట్లు మౌలికసదుపాయాలు, పెట్టబడుల శాఖ వర్గాలు తెలిపాయి. ఏ రకంగా చూసుకున్నా విశాఖపట్నం విమానాశ్రయం మూసివేయకుండా భోగాపురం విమానాశ్రయం అసలు లాభదాయకం కాదు. అలాంటప్పుడు జీఎంఆర్ ఒక్కో ప్రయాణికుడిపై 300 రూపాయల లెక్కన ఎలా ఇవ్వగలదు?. జీఎంఆర్ గ్రూప్ ఇప్పటికే అప్పులు భారంతో సతమతం అవుతూ వీటి నుంచి ఎలా గట్టెక్కాలా అని ప్రయత్నిస్తోంది.

ఈ తరుణంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం టెండర్ ను ఏపీ సర్కారు జీఎంఆర్ కు ఇవ్వటానికి రెడీ అయిపోయింది. సీఎం చంద్రబాబు చెబుతున్నట్లు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల మెయింట్ నెన్స్, రిపేర్, ఓవర్ హాలింగ్(ఎంఆర్ వో) సౌకర్యం ఇప్పటికిప్పుడు సక్సెస్ అయ్యే అవకాశమే లేదు. అక్కడ ఈ రంగం వృద్ధి చెందాలంటే కనీసం దశాబ్దంపైనే పడుతుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. నిజంగా ఏపీ సర్కారుతో..చంద్రబాబునాయుడితో ‘కుమ్మక్కు’ అయి ఉండకపోతే జీఎంఆర్ సంస్థ ఏ రకంగా ప్రాజెక్టును చేపట్టగలదు? అనే ప్రశ్నలు రావటం సహజం అని మౌలికసదుపాయాల శాఖ వర్గాలు చెబుతున్నాయి.

Next Story
Share it