Telugu Gateway
Politics

‘బాక్సైట్’ తవ్వకాలపై చంద్రబాబు అబద్ధాల కోటింగ్

‘బాక్సైట్’ తవ్వకాలపై చంద్రబాబు అబద్ధాల కోటింగ్
X

‘దోపిడీ’ కుదరకే బాక్సైట్ పై వెనక్కి

జీవో జారీ చేసి మరీ అధికారులపై నెపం

ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చాలా విషయాల తరహాలోనే ఏపీలో ‘బాక్సైట్’ తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకించారు. గిరిజనుల హక్కులకు భంగం కలిగిస్తే సహించేది లేదంటూ ప్రకటించారు. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే సీన్ మారింది. బాక్సైట్ తవ్వకాలకు లైన్ క్లియర్ చేసేందుకు ఆగమేఘాల మీద ఫైలు కదిల్చారు. ఢిల్లీలోనూ ఈ ఫైలును క్లియర్ చేసేందుకు టీడీపీకి చెందిన ఓ కేంద్ర మాజీ మంత్రి చక్రం తిప్పారు. ఆ సమయంలో టీడీపీ ముఖ్యులు..ఆయనకు ముడుపుల పంపకాల మధ్య తేడాలు వచ్చాయని పార్టీలో జోరుగా ప్రచారం కూడా జరిగింది. ప్రతిపక్షంలో ఉండగా బాక్సైట్ తవ్వకాలను ఎంత గట్టిగా వ్యతిరేకించారో...అధికారంలోకి వచ్చాక మళ్ళీ అంతే గట్టిగా బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా వ్యవహరించారు. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించిన వారిపై విమర్శలు ఎక్కుపెట్టారు. చంద్రబాబు సర్కారు బాక్సైట్ తవ్వకాలకు నిర్ణయం తీసుకుని వేగంగా ముందుకు కదలటంతో రాజకీయపక్షాలు..గిరిజనులు..మావోయిస్టులు కూడా సర్కారును టార్గెట్ చేశారు.

కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా అంటూ ఏపీ సర్కారు 2015 నవంబర్ లో జీవో 97 జారీ చేసి అన్ రాక్ కు బాక్సైట్ తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కూడా. 1212 హెక్టార్లలో 222 మిలియన్ టన్నుల బాక్సైట్ తవ్వకాలు చేసుకోవచ్చంటూ పచ్చ జెండా ఊపేసింది. ఈ జీవో జారీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం రేపింది. రాజకీయంగా కూడా చంద్రబాబు సర్కారు తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరకు అప్పటి అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణకు తెలియకుండానే అటవీ శాఖ ఉన్నతాధికారులు జీవో జారీ చేశారని టీడీపీ సర్కారు నెపాన్ని అంతా ఐఏఎస్ అధికారి ఏ కె పరీడాపైకి తోసేసింది. చివరకు కొంత మంది మంత్రులు విలేకరుల సమావేశం పెట్టి మరీ మంత్రికి తెలియకుండానే జీవో జారీ అయిందని చెప్పి పోయిన పరువును కాపాడుకునే ప్రయత్నం చేశారు.

కానీ అప్పటికే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సంతకం చేసిన తర్వాతే పరీడా బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ జీవో జారీ చేశారు. కానీ ఇఫ్పుడు కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ టీడీపీలో చేరే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాక్సైట్ తవ్వకాల జీవో జారీ విషయాన్ని మర్చిపోయి...తాను మాత్రమే అనుమతులు రద్దు చేసినట్లు ‘కలరింగ్’ ఇచ్చే ప్రయత్నం చేశారు. వాస్తవానికి బాక్సైట్ భారీ దోపిడీ స్కెచ్ కు చంద్రబాబు తన వంతు సాయం అందించారు. కానీ పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేకపోవటంతోనే వెనక్కి తగ్గి...మళ్ళీ ఎప్పటిలాగానే బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించిన ధీరుడుగా చెప్పుకునే పనిలో పడ్డారు.

Next Story
Share it