చంద్రబాబు పిలుపు..టీడీపీలో కలవరం
తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇస్తున్న పిలుపు ఆ పార్టీలో కలవరం రేపుతోంది. చంద్రబాబు పిలుపును ప్రజలు బలపరిస్తే ప్రస్తుతం టీడీపీలో ఉన్న 23 మంది ఫిరాయింపుదారులు ఇంటిబాట పట్టాల్సిందే. అందులో నలుగురు మంత్రులు కూడా ఉన్నారు. అవసరం లేకపోయినా కేవలం రాజకీయ కోణంలో ప్రతిపక్షానికి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా..ఏకంగా ప్రతిపక్షం ఇదే కారణంతో ఏడాదిన్నరకుపైగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినా కూడా ఆయన లెక్క చేయలేదు. ఇప్పుడు టీడీపీ నుంచి కొంత మంది నేతలు తమ పదవులకు రాజీనామా చేసి వైసీపీలో చేరటంతో చంద్రబాబులో కలవరం మొదలైంది.
అందుకే ఉండబట్టేక తమ దగ్గర చాలా మంది వాళ్ళే ఉన్నారనే విషయాన్ని కూడా మర్చిపోయి ఫిరాయింపుదారులను ఓడించాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఫిరాయింపుల వ్యవహారాన్ని కూడా చంద్రబాబు తన హయాంలో కొత్త పీక్ లకు తీసుకెళ్లారు. ఎలా అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకోవటమే కాకుండా..సొంత పార్టీ నేతలను కాదని..ఏకంగా నలుగురు ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇచ్చి మరీ ఫిరాయింపుదారులకే ఆదర్శంగా నిలిచారు. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారటం పిరాయింపు అయితే చంద్రబాబు ఇంకా వాటిని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. కానీ ఆయన దగ్గర నుంచి ఎవరు వెళ్లినా సరే వాళ్లు మాత్రమే అవకాశవాదులు..పదవుల కోసం వెళ్ళిపోయారని చెప్పటం ఒక్క టీడీపీ నేతలకే చెల్లింది.