Telugu Gateway
Politics

బిజెపి సభకు వైసీపీ జనసమీకరణ

బిజెపి సభకు వైసీపీ జనసమీకరణ
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి సభకు అయితే జనం రారని..వైసీపీ ప్రధాని సభకు జనసమీకరణ చేపట్టిందని ఆరోపించారు. కేసుల మాఫీ కోసమే జగన్ లాలూచీ పడ్డారని విమర్శించారు. తండ్రీ, కొడుకుల అవినీతి పాలన అంతం అయ్యేరోజు దగ్గరలోనే ఉందని గుంటూరు సభలో ప్రధాని వ్యాఖ్యలపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ‘లోకేష్ తండ్రిగా నేను గర్వపడుతున్నా. మోదీకి కుటుంబం లేదు. అనుబంధాలు తెలియవు. విడాకులు ఇవ్వకుండానే యశోద బెన్‌ను దూరం పెట్టారు. నేను మాట్లాడితే మోదీ తల ఎక్కడ పెట్టుకుంటారు. నా కుటుంబాన్ని చూసి నేను గర్విస్తున్నా. నాది యూ టర్న్ కాదు. నాది రైట్‌ టర్న్. మోదీ నమ్మించి మోసం చేశారు. అందుకే ఎదురు తిరిగా. గుజరాత్ కన్నా ఏపీ అభివృద్ధి చెందుతోందని మోదదీ అసూయ అమరావతి నా సొంత నిర్మాణం కాదు. హుందాతనాన్ని మరిచి మోదీ మాట్లాడుతున్నారు. ఆయన అసూయ పడేలే అమరావతి నిర్మాణం చేసి చూపిస్తా’ అని వ్యాఖ్యానించారు. విజయవాడలో ఆదివారం జరిగిన పసుపు-కుంకుమ కార్యక్రమానికి చంద్రబాబు నల్ల చొక్కా ధరించి వచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఇళ్లపట్టాల పంపిణీ కోసం గవర్నర్ ఆమోదం కోసం పంపితే మూడు నెలలు పెండింగ్‌లో పెట్టారు.7500 కోట్ల రూపాయిల విలువైన ఆస్తిని పేదలకు పట్టాల రూపంలో పంపిణీ చేస్తున్నాం. నన్ను తిట్టడానికే ఫ్లయిట్‌ వేసుకుని వచ్చారు. ఏపీకి ఆయన ఏం చేశారో చెప్పలేని స్థితిలో ఉన్నారు. తిట్టడం సులభం..పనులు చేయడం కష్టం. మోదీని ఎవరు క్షమించరు. తల్లిని చంపి బిడ్డను కాపాడారు. తల్లిని కాపాడతానని మోదీ చెప్పారు. తల్లిని దగా చేసిన వ్యక్తి మోదీ.

పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి మట్టి, నీరు తెచ్చి మన మొహం మీద కొట్టారు. మోదీకి, నాకు వ్యక్తిగత విభేదాలు లేవు. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని 14 సీట్లు ఇస్తే కేవలం 4సీట్లు గెలిచారు. పొత్తుతో నష్టపోయింది మేమే లెక‍్కలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. లెక్కలు అడగాల్సింది మీరు కాదు. రాజధానికి డబ్బులు ఇవ్వరు. పోలవరం డీపీఆర్ ఆమోదం తెలపరు. వెనుకబడిన జిల్లాలకు నిధుల ఊసు కూడా ఎత్తరనివిమర్శించారు.

మేం బానిసలం కాదు. అప్పులు చేసి రాజధాని కడుతుంటే పన్నులు వసూలు చేస్తున్నారు. మోదీకి కేవలం ప్రచారం ఆర్భాటం. గురువుకు నామాలు పెట్టిన సంస్కృతి మీది. ఓటమిలో సీనియర్‌ అని నన్ను విమర్శలు చేస్తున్నారు. నేను ఎవరికీ భయపడను. ఒకరి దగ్గర మోకరిల్లాల్సిన అవసరం నాకు లేదు. ఏపీలో ఉన్న పెట్రోలియం ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు తరలించి, మన సంపదను దోచుకునేందుకు చూస్తున్నారు. ఇక పెద్ద నోట్ల రద్దు పిచ్చి తుగ్లక్ చర్య. దేశాన్ని, రాజకీయాలను మోదీ కలుషితం చేస్తున్నారు. ఆయన తనకు కావాల్సిన వ్యక్తులకు దేశాన్ని దోచిపెడుతున్నారు. మహా కూటమి తలుచుకుంటే మోదీ ఇంటికి పోవడం ఖాయం.

Next Story
Share it