Telugu Gateway
Andhra Pradesh

ఎట్టకేలకు ఏపీకి రైల్వే జోన్

ఎట్టకేలకు ఏపీకి రైల్వే జోన్
X

ఎన్నికల ముందు కేంద్రంలోని మోడీ సర్కారు ఏపీకి సంబంధించి అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న విశాఖపట్నం రైల్వే జోన్ కు గ్రీన్ సిగ్నల్ ఇఛ్చింది. కేంద్రంలో టీడీపీ కొనసాగినంత కాలం రైల్వే జోన్ సాధ్యంకాదని తేల్చిన కేంద్రం..ఎన్నికల ముందు ‘రాజకీయ నిర్ణయం’ తీసుకుంది. ఇదే నిర్ణయం ఇంతకు ముందే తీసుకుని ఉంటే మోడీ సర్కారుకు కూడా కొంత గౌరవం ఉండేది కదా అనే విమర్శలు విన్పిస్తున్నాయి. విభజన చట్టంలో రైల్వే జోన్ అంశాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. వివిధ కోణాల్లో అధ్యయనం చేసిన తర్వాత కొత్త జోన్ పై నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. విశాఖ కేంద్రంగా ఏపీలో కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటుకు పచ్చజెండా ఊపటంతో దేశంలో 18వ రైల్వే జోన్‌ ఏర్పాటు కానుంది. విశాఖలో ప్రధాని మోదీ పర్యటనకు రెండు రోజుల ముందు రైల్వే జోన్‌పై ప్రకటన వెలువడటం గమనార్హం. రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ బుధవారం రాత్రి రైల్వే భవన్‌లో రైల్వే బోర్డు ఛైర్మన్‌ వినోద్‌ కుమార్‌ యాదవ్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చాం. కొత్త రైల్వే జోన్‌ను దక్షిణ కోస్తా రైల్వే (ఎస్‌సీఓఆర్‌)గా వ్యవహరిస్తారు. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో కలిపి ఈ రైల్వే జోన్‌ ఉంటుంది.

వాల్తేరు డివిజన్‌ను రెండు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని (ఏపీ పరిధిలోది) విజయవాడ డివిజన్‌లో విలీనం చేయడం ద్వారా నూతన రైల్వే జోన్‌ కిందికి తెస్తాం. వాల్తేరు డివిజన్‌లోని మిగిలిన భాగాన్ని (ఒడిశా ప్రాంతంలోది) రాయగడ కేంద్రంగా నూతన డివిజన్‌గా ఏర్పాటు చేస్తాం. అది తూర్పు కోస్తా రైల్వే జోన్‌ పరిధిలో ఉంటుంది. దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్‌ డివిజన్లతో కూడుకుని ఉంటుందిఅని రైల్వే మంత్రి ప్రకటించారు. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ ఎప్పటిలోగా ఉనికిలోకి వస్తుందన్న మీడియా ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ రైల్వే బోర్డు, రైల్వే శాఖ కలసి ఈ నిర్ణయం తీసుకున్నాయి. తదుపరి విధానపరమైన ప్రక్రియ కొనసాగుతుంది..అని పేర్కొన్నారు. అయితే రైల్వే జోన్ తో బిజెపి మరో మోసం చేసిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు.

Next Story
Share it