Telugu Gateway
Politics

‘పశ్చిమ బెంగాల్’లో సీబీఐ..పోలీస్ ఫైటింగ్

‘పశ్చిమ బెంగాల్’లో సీబీఐ..పోలీస్ ఫైటింగ్
X

పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి. ఏకంగా సీబీఐ అధికారులను కోల్ కతా పోలీసులు అడ్డుకున్నారు. అంతే కాదు..సీబీఐ టీమ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేంద్రం ఏకంగా పశ్చిమ బెంగాల్ లోకి సీఆర్పీఎఫ్ బలగాలను కూడా దింపింది. తాజా పరిణామాలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడుతున్నారు. బిజెపి బెంగాల్ పై దాడి చేస్తోందని ఆమె ఆరోపించారు. శారదా చిట్‌ఫండ్‌, రోజ్‌వ్యాలీ స్కామ్‌ కేసులకు సంబంధించి ప్రశ్నించేందుకు కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ నివాసానికి ఆదివారం సీబీఐ అధికారుల బృందం చేరుకుంది. బృందాన్ని లోపలికి అనుమతించకుండా వెలుపలే కోల్‌కతా పోలీసులు అడ్డుకున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా రాజీవ్‌ కుమార్‌ను అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో సీబీఐ అధికారులను కోల్‌కతా పోలీసులు నిలువరించడం కీలక పరిణామంగా మారింది.

ఈ స్కామ్‌లపై పశ్చిమ బెంగాల్‌ పోలీసుల విచారణకు నేతృత్వం వహిస్తున్న కుమార్‌ను కేసులకు సంబంధించిన పత్రాల గల్లంతుపై ప్రశ్నించేందుకు సీబీఐ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించలేదని దర్యాప్తు సంస్థకు చెందిన అధికారులు వెల్లడించారు. సీబీఐ అధికారుల బృందం కుమార్‌ ఇంటికి చేరుకోగానే నివాసం వెలుపలే కోల్‌కతా పోలీసులు, సెంట్రీలు వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ నివాసానికి పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ చేరుకోవడంతో కుమార్‌ ఇంటివద్ద హైడ్రామా నెలకొంది. సీబీఐ బృందం, బెంగాల్‌ పోలీసుల వాగ్వాదంతో ఉద్రిక్తత ఏర్పడింది. సీబీఐ సిబ్బందిని సమీప పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. సీబీఐ తీరుకు నిరసనగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మెట్రో ఛానల్ వద్ద దీక్షకు దిగారు.

Next Story
Share it