Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు ‘స్మార్ట్ మోసం’!

చంద్రబాబు ‘స్మార్ట్ మోసం’!
X

ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ‘స్మార్ట్’గా చేసిన మోసం ఇది. అధికారంలోకి వచ్చిన కొత్తలో స్మార్ట్ విలేజ్..స్మార్ట్ వార్డు అంటూ ఊదరగొట్టారు. ఏపీలోని గ్రామాలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీని కోసం 16, 383 గ్రామాలను ఎంపిక చేసినట్లు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. పారిశ్రామికవేత్తలు..ఇతర రంగాలకు చెందిన వారు స్వచ్చందంగా తమ గ్రామాలను అభివృద్ధి చేయటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత చాలా మంది ఇందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని కూడా చెప్పుకున్నారు. కానీ అంతిమంగా చూస్తే ఇఫ్పటివరకూ ఏపీలో ‘స్మార్ట్’గా మారిన గ్రామాలు ఎన్ని? వార్డులు ఎన్ని అంటే పెద్దగా చెప్పుకోవటానికి ఏమీలేదని సర్కారు వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబునాయుడు ఏ కార్యక్రమం ప్రారంభించేటప్పుడు అయినా హంగామా చేయటం...ఆ తర్వాత దాన్ని పక్కన పడేసి మళ్లీ కొత్త దాని వెంట పడటం ఆయనకు అలవాటే.

నిజంగా గ్రామాలకు అత్యంత కీలకమైన ఈ కార్యక్రమాన్ని కూడా చంద్రబాబునాయుడు తనదైన శైలిలో అటకెక్కించారు. ఓ గ్రామాలను తీర్చిదిద్దాలని స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు కార్యక్రమం ఘనంగా చేపట్టిన సర్కారు ప్రకాశం జిల్లాలో ఓ ఎన్ఆర్ఐ తన గ్రామంలో ఎంపిక చేసిన కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకొస్తే ఎమ్మెల్యే అనుమతి లేదని అడ్డుకున్న సంఘటనలు పత్రికల్లో రిపోర్టు అయ్యాయి. తాను పుట్టిన..చదువుకున్న ఊరికి విదేశాల్లో ఎంతో కొంత సంపాదించిన ఎన్ఆర్ఐ ముందుకొస్తే దానికి ఎమ్మెల్యే అనుమతి తప్పనిసరా?. ఇదెక్కడి విచిత్రం. ఇది ఒకెత్తు అయితే సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తనయుడు, మంత్రి నారా లోకేష్ టీడీపీ వ్యవస్థాపకుడు అయిన ఎన్టీఆర్ గ్రామం నిమ్మకూరును ‘దత్తత’ తీసుకున్నట్లు ప్రకటించారు.

ఆయన దత్తత తీసుకున్నట్లు ప్రకటించి పూర్తిగా సర్కారు నిధులతో పనులు చేయించారు. అది కూడా అరకొరగానే. సర్కారు నిధులతో పనిచేసినప్పుడు అది నారా లోకేష్ దత్తత గ్రామం ఎలా అవుతుంది?. 2015లో ఈ కార్యక్రమం ప్రారంభించినప్పుడు చంద్రబాబు ‘స్మార్ట్ విలేజ్..స్మార్ట్ వార్డు’లపై హంగామా చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఇది అటకెక్కినట్లు అయింది. నిజంగా విపరీతంగా పెరిగిపోయిన రాజకీయ జోక్యం కారణంగా సొంత గ్రామాలను అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్న వారు కూడా ముందుకు రాలేని రాజకీయ పరిస్థితులు కల్పించారు ఏపీలో అని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు అంటూ పెద్ద పెద్ద కబుర్లు చెప్పే చంద్రబాబు, లోకేష్ లు చాలా కన్వీనెంట్ గా ‘స్మార్ట్ విలేజ్..స్మార్ట్ వార్డు’ పథకాన్ని అటకెక్కించారు.

Next Story
Share it